పార్టీ బలోపేతానికి గాను ఇటీవల జిల్లాల వారీగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రణాళికలతో ముందుకు వెళుతున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరో నూతన జిల్లాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉండటంతో ఆ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ మాజీ ముఖ్యనేతలను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు జగన్ పావులు కదుపుతోందని చర్చ జరుగుతోంది. పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలోని నరసరావుపేటకు చెందిన మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఈ చర్చ జోరందుకుంది.
ఒంగోలు జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు జిల్లాలో ఉన్న నేపథ్యంలో వారిని తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందా అన్న చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ నాయకులు వైసీపీలోకి చేరితే ఆయా నియోజకవర్గాల్లో పార్టీబలం పెరిగే అవకాశం ఉందన్న వాదన ఆ పార్టీ నేతల నుండే వినిపిస్తుంది. ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గం నుండి మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకుంటే ఆ నియోజకవర్గంలో పార్టీ పరుగులు పెడుతుందన్న వాదన వినిపిస్తోంది. గతంలోనే వైకాపాలో మానుగుంట చేరతారన్న ప్రచారం ముమ్మరంగా సాగింది. కాని అనివార్య కారణాల వలన ఆయన వైకాపా తీర్థం పుచ్చుకోకపోవటంతో అధిష్టానవర్గం కందుకూరు నియోజకవర్గం వైకాపా ఇన్‌చార్జిగా తుమాటి మాధవరావును నియమించింది. దీంతో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. త్వరలో కందుకూరు మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగితే మహీధర్ రెడ్డి తన స్వంత ప్యానల్ ను పోటీలోకి దించే అవకాశాలున్నట్లు సమాచారం. దీంతో మునిసిపల్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఈ నియోజకవర్గంలో రాజకీయాలు తారుమారుఅయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా మహీధర్ రెడ్డి వైకాపా గూటికి చేరితే మాత్రం ఆ పార్టీ బలం నియోజకవర్గంలోనే కాకుండా ఇతర నియోజకవర్గాలపై కూడా ఆయన ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉండగా కనిగిరి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు ముక్కు ఉగ్రనరసింహరెడ్డి కూడా ప్రస్తుతం రాజకీయాల్లో దూరంగా ఉన్నారు. అదేవిధంగా మరో మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి కూడా వైకాపాకి దూరంగా ఉంటూ తన వ్యాపారాల లావాదేవీల్లో మునిగి తేలుతున్నారు. వీరిద్దరి ప్రభావం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున్నే ఉంది. ఈపాటికే కాశిరెడ్డి వైకాపాలో ఉన్నప్పటికీ క్రియాశీలకంగా మాత్రం వ్యవహరించటం లేదు. వీరు ఇద్దరు వైకాపాకి కనిగిరిలో ఎంతో అవసరం అన్న భావన ఆ పార్టీనేతల్లోనే వ్యక్తమవుతోంది. దీంతో జగన్ ప్రత్యేక దృష్టిసారించి ఉగ్రను పార్టీలోకి చేర్చుకునేందుకు చర్యలు తీసుకుంటారా అన్న చర్చ సాగుతుంది. అదేవిధంగా కాశిరెడ్డి కూడా నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. నియోజకవర్గంనుండి శాసనసభ్యునిగాను - మంత్రిగాను - జిల్లా పరిషత్ చైర్మన్ గాను - జిల్లాపార్టీ అధ్యక్షునిగాను కాశిరెడ్డి పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయన సేవలు వైకాపాకి ఎంతో అవసరం ఉందన్న వాదన రాష్ట్ర పార్టీ నుండే వినిపిస్తున్నాయి. అదే విధంగా మిగిలిన నియోజకవర్గాల్లోని కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు - మాజీ శాసనసభ్యులతోపాటు - మాజీ ఎంపిపిలు - మాజీ జడ్ పిటిసిలను తమపార్టీ వైపు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైకాపా గూటికి చేర్చుకుంటారా అన్న చర్చ సాగుతుంది.
అసెంబ్లీ - పార్లమెంటు ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలకు పైగా గడువు ఉండటంతో ముందుగానే ప్రణాళికబద్ధంగా కాంగ్రెస్ తాజా, మాజీ తమ్ముళ్లను చేర్చుకుంటారా లేక వదిలివేస్తారా అనే చర్చ సైతం వైసీపీలో జరుగుతోంది. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తెలుగుతమ్ముళ్లను భారీగా తమపార్టీ వైపు చేర్చుకుని పార్టీబలాన్ని పెంచారు. అదే ఫార్ములాను జగన్ చేపడ్తారా లేద అనేది తేలాలంటే వేచి చూడాలేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/