జ‌గ‌న్ కొత్త రాజ‌కీయం

Update: 2015-08-17 16:40 GMT
ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్... ఇటీవ‌లి కాలంలో త‌న రాజ‌కీయ నైపుణ్యాన్ని పెంచుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఇప్పటికే ఆందోళనలు చేస్తోంది. ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర జగన్ ఓ రోజు ధర్నా కూడా చేశారు. ఈ నెల 29న రాష్ట్రవ్యాప్త బంద్‌ కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. అయితే ప్ర‌జా సమస్యలపై ఎన్ని ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు చేస్తున్నా పార్టీకి తగిన మైలేజ్ రావట్లేదని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. ఇందుకు గ్రూప్ రాజ‌కీయాలు కార‌ణ‌మ‌ని ఆ పార్టీ నిర్ణ‌యానికి వ‌చ్చింది. దీంతో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు వ్యూహం రచించింది వైసీపీ హైకమాండ్.

ఏపీకి ప్రత్యేక హోదా తేవడంతోపాటు, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామంటు జగన్ ప్ర‌క‌టిస్తున్నారు. అయితే అవి విజయవంతం అవ్వాలంటే... ముందు పార్టీ అంతర్గత సమస్యల్ని సరిదిద్దాలనుకున్న అధినేత... సీనియర్ల సేవల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. అందులో భాగంగా 13 జిల్లాల్లో పరిశీలకుల్ని నియమించారు. పరిశీలకుల కమిటీలో బొత్స, విజ‌య సాయిరెడ్డి, సుబ్బారెడ్డి వంటి సీనియ‌ర్లున్నారు. ఈ నెల 18న సమావేశమవుతున్న కమిటీ... మిగతా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టడం, పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం వంటి అంశాలపై సూచనలు చేయనుంది.

ప్రస్తుతం వైసీపీ కొన్ని జిల్లాల్లో బలహీనంగా ఉండ‌గా..కొన్ని చోట్ల వర్గ విభేదాలతో సతమతమవుతోంది. ఇప్పటికే గ్రూప్ రాజకీయాల్ని తట్టుకోలేక నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావుకు, సీనియర్ నేత బొత్స కూ మధ్య మనస్పర్థలున్నాయి. కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి గ్రూపు రాజకీయాల్ని జిల్లా పరిశీలకుల కమిటీ ఎంతమేరకు నిలువరిస్తుందన్నది తేలాల్సిన ప్రశ్న. అంతర్గత సమస్యలకు చెక్ పెడితేనే... ప్రజా సమస్యలపై పోరాటాలు విజయవంతమవుతాయని భావిస్తున్న హైకమాండ్... అందర్నీ కలుపుకుంటూ... సంయమనంతో ముందుకు సాగాలని పరిశీలకులకు దిశానిర్దేశం చేసింది. పార్టీలోని నేతల మధ్య విభేధాల తలనొప్పిని కొత్త క‌మిటీలు ఎలా సరిదిద్దుతాయో చూడాలి మ‌రి.
Tags:    

Similar News