అసెంబ్లీని వెలేయడమే జగన్ పరిష్కారం!

Update: 2017-10-26 13:46 GMT
ప్రతిపక్షాల గొంతునొక్కేలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న... చంద్రబాబునాయుడు ప్రభుత్వ దుర్నీతిని ఎండగట్టాలంటే... అసలు శాసనసభను వెలి వేయడమే ఉత్తమం అని జగన్మోహన్ రెడ్డి భావించారు. శాసనసభలో నైతిక విలువలకు మాత్రమే కాకుండా, రాజ్యాంగబద్ధమైన విలువలకు కూడా పాతర వేస్తున్నప్పుడు ఆ వ్యవస్థ ద్వారా న్యాయం జరగనప్పుడు.. దానిని ఆశ్రయించడంలో అర్థం లేదనే విరక్తిని ఆయన కార్యాచరణలో పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే.. అధికార పార్టీలోకి ఫిరాయిస్తే.. రాజ్యాంగబద్ధ విలువలు పాటించి, రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి వారితో రాజీనామాలు చేయించి.. తిరిగి గెలిపించుకుని తమ సత్తా చాటుకోవడానికి బదులుగా.. ఫిరాయింపు దార్లనే వెరపు కూడా లేకుండా తగుదునమ్మా అంటూ మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన ప్రభుత్వం తీరు మీద జగన్మోహన రెడ్డి ఈ రకంగా తన నిరసన తెలియజేయదలచుకున్నారు.

గురువారం నాడు లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎల్పీ సమావేశం నిర్వహించారు జగన్. నవంబరు 10 నుంచి అసెంబ్లీ మొదలు కానున్న నేపథ్యంలో సన్నాహక సమావేశం ఇది. నిజానికి జగన్ పాదయాత్ర 6వ తేదీనే ప్రారంభం కాబోతోంది. ఆయన అసెంబ్లీ హాజరయ్యే పరిస్థితి లేదు. కాకపోతే.. ఆయన లేకుండా.. తమకు కూడా సభకు వెళ్లే ఉద్దేశం లేదని ఎమ్మెల్యేలు కూడా సూచించినట్లు వార్తలు వచ్చాయి. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న జగన్.. చివరికి వారికి అనుకూలంగానే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఓటు వేసినట్లు తెలుస్తోంది.

అసలు తమ పార్టీ తరఫున గెలిచి.. అధికార పార్టీలోకి ఫిరాయించిన వారందరి పై అనర్హత వేటు వేయడం గురించి.. ఆయన ఇప్పటికే పలుమార్లు స్పీకరుకు ఫిర్యాదు చేశారు. కోర్టులో వ్యాజ్యాలు కూడా నడిపారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. స్పీకరు వీరి ఫిర్యాదుల గురించి చర్యలు తీసుకున్నది కూడా లేదు. పైగా నలుగురికి ఏకంగా చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఈ రాజ్యాంగ వ్యతిరేక పోకడల మీద దేశవ్యాప్త చర్చకు ఆస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే.. జగన్ ఇలాంటి నిర్ణయానికి వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షమే లేకుండా సభ నడిపి.. తెలుగుదేశం ఎలా నవ్వులపాలు అవుతుందో.. ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుందో చూడాలని ప్రజలు అనుకుంటున్నారు.
Tags:    

Similar News