భూమా గురించి జగన్ ఎమోషనల్ అయిన వేళ..

Update: 2016-02-24 04:20 GMT
‘‘టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. అనుకున్న సంఖ్య వచ్చిన వెంటనే వారి పేర్లు ప్రకటిస్తా. పేర్లు చెప్పటం మొదలెట్టిన గంటలో బాబు సర్కారు కూలిపోతుంది’’ అంటూ మీడియా దగ్గర ధీమాగా చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు షాకిచ్చేలా నలుగురు ఎమ్మెల్యేల్ని సైకిల్ మీద ఎక్కించేయటం తెలిసిందే. నలుగురు ఎమ్మెల్యేలు.. ఒక ఎమ్మెల్సీ పచ్చ కండువా కప్పుకున్నా.. ఎవరి గురించి పెద్దగా మాట్లాడని జగన్.. భూమా ఇష్యూలో మాత్రం భారీగానే బరస్ట్ అయ్యారు. ‘అన్న’ అలా చేస్తాడని తాను ఊహించలేదన్నట్లుగా మాట్లాడటమే కాదు.. భావోద్వేగ వ్యాఖ్యలతో పాటు.. వేదాంత ధోరణిలో మాట్లాడటం కనిపించింది.

జగన్ కు భావోద్వేగాలు పెద్దగా పట్టవని.. మెకానికల్ గా ఉంటారనే విమర్శలకు భిన్నంగా తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. భూమా నాగిరెడ్డి.. ఆయన కుమార్తె అఖిలప్రియ పార్టీ మారిన తీరుపై జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాగిరెడ్డి అన్న విషయంలో బాధ అనిపించింది. శోభమ్మ చనిపోయినప్పుడు.. ఆమె మొదటి వర్థంతి సందర్భంగా అమ్మ.. నేను.. నా భార్య భారతి.. చెల్లెలు షర్మిల అందరం కలిసి వెళ్లాం. అంతగా ఆయన్ను ఫ్యామిలీ మెంబర్ గా భావించాం. అలాంటి వ్యక్తిని కూడా ప్రలోభాలు పెట్టి తీసుకెళ్లారు’’ అని బరస్ట్ కావటం గమనార్హం.

తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తులను ప్రలోభ పెట్టి.. తన నుంచి తీసుకెళ్లటంపై జగన్ బాగానే డిస్ట్రబ్ అయినట్లుగా తాజా వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. తనకు క్లోజ్ గా ఉన్న వ్యక్తులకు డబ్బు.. మంత్రి పదవుల్ని ఎర చూపి తీసుకొనిపోవటం బాధ కలిగించిందంటూ జగన్ ఆవేదనగా మాట్లాడిన తీరు చూస్తే.. భూమా ఇష్యూలో జగన్ ఎమోషనల్ అయినట్లు అర్థమవుతుంది.
Tags:    

Similar News