జగన్ దీక్ష భగ్నమైంది

Update: 2015-10-13 04:07 GMT
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిరవధిక దీక్ష చేస్తున్న ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష భగ్నమైంది. ఏడు రోజులుగా చేస్తున్న దీక్ష కారణంగా బలహీనమైన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించే అవకాశం ఉందన్న భావనతో ఆయన చేత బలవంతంగా దీక్షను ఆపించేశారు. నాటకీయంగా సాగిన పరిణామాల నడుమ.. స్వల్ప ఉద్రిక్తతల మధ్య జగన్ దీక్షకు ఫుల్ స్టాప్ పెట్టారు.

మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జగన్ దీక్ష చేస్తున్న ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు.. కెమేరా కేబుళ్లను కట్ చేసి.. లైట్లు (?) ఆపేసి దీక్షా శిబిరాన్ని పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు. నిద్రలో ఉన్న జగన్ ను పోలీసులు తరలించే ప్రయత్నం చేశారు. దీనికి జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. . ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు పల్చగా ఉన్నారు. తక్కువ సంఖ్యలో ఉన్న వారంతా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

వీరిని అడ్డుకున్న పోలీసులు.. జగన్ ను బలవంతంగా అంబులెన్స్ లో ఎక్కించారు. వాహనానికి ఎవరూ అడ్డు రాకుండా ఉండేందుకు వీలుగా.. పెద్ద సంఖ్యలో పోటీసులు అంబులెన్స్ ను చుట్టుముట్టి కాపలాగా కాస్త దూరం పరిగెత్తారు. అనంతరం గుంటూరు ఆసుపత్రికి తరలించి.. ఆయన్ను నేరుగా ఐసీయూకి తీసుకెళ్లారు.

అక్కడ ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేయగా.. జగన్ నిరాకరించటం.. ఇప్పుడు కానీ ఫ్లూయిడ్స్ ఎక్కించకుండా.. సహకరించని పక్షంలో ముప్పు తప్పదని.. ఆరోగ్య పరిస్థితి క్షీణించటం ఖాయమని వైద్యులు నచ్చజెప్పి.. ఆయనకు బలవంతంగా చికిత్స మొదలు పెట్టారు. వాస్తవానికి సోమవారం రాత్రి జగన్ ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేసిన వైద్య బృందం ఆయనకు అత్యవసరంగా వైద్యం అవసరని సూచించారు.

జగన్ దీక్షను అడ్డుకోవటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జగన్ ను ఆసుపత్రికి తరలించటంతో.. ఆయన తల్లి విజయమ్మ.. సతీమణి భారతి.. చెల్లెలు షర్మిలలు ఆసుపత్రిలో ఆయన వెంటే ఉన్నారు. ఏడు రోజుల పాటు సాగిన జగన్ దీక్ష.. పోలీసుల జోక్యంతో మంగళవారం ఉదయం నాలుగు.. నాలుగున్నర ప్రాంతంలో ముగిసింది.
Tags:    

Similar News