వరద పోటెత్తింది.. సీమ ఎండిపోయింది ఎందుకు?

Update: 2019-10-29 07:46 GMT
ఈసారి వానలు దంచికొట్టాయి. గోదావరి, కృష్ణా నదులు పోటెత్తాయి. దాదాపు 1000 టీఎంసీలకు పైగానే నీరు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వృథాగా సముద్రంలోకి పోయింది. ఈనీరంతా సీమకు తరలిస్తే పచ్చబడేది.  కరువు సీమ రాయలసీమలోని ప్రాజెక్టులు మాత్రం వట్టిపోతున్నాయి. కనీసం 10శాతం కూడా ప్రాజెక్టుల్లో నీరు నిల్వలేకపోయాయి. ఈ పరిణామంపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు.  అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలాశాయాలు ఖాళీగా పెట్టడంపై అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

అమరావతిలో నిర్వహించిన జల వనరుల శాఖ సమీక్షలో ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఇంత వరద వచ్చినా రాయలసీమలోని వరద జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపకపోవడంపై అధికారులను నిలదీశారు. సీమలోని చిత్రావతి - బ్రహ్మంసాగర్ వట్టిపోవడంపై ప్రశ్నించారు.

దీనికి అధికారులు బెంబేలెత్తిపోయారు. కాలువల సామర్థ్యం తక్కువగా ఉండడం.. ఆశించినంత నీరు  కాలువల్లో ప్రవహించకపోవడం వల్లే ప్రాజెక్టులు నింపలేకపోయామని జవాబిచ్చారు.

దీంతో కాలువల సామర్థ్యాన్ని పెంచాలని జగన్ ఆదేశించారు. ఎంత ఆర్థిక లోటు ఉన్నా సీమలో కృష్ణా వరద జలాలపై ఆధారపడ్డ జలాశయాలను 40 రోజుల్లో నింపేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. కాలువలను తవ్వి.. పూడికలు తీసి.. పెద్దగా చేయాలని ఆదేశించారు. ఎన్ని కష్టాలున్నా సాగునీటి ప్రాజెక్టులకే తమ ప్రథమ కర్తవ్యమని జగన్ స్పష్టం చేశారు.
   

Tags:    

Similar News