బాధ్య‌త నాది.. పూచీ నాద‌న్న ప‌వ‌న్ మోసం చేశాడు

Update: 2019-02-08 05:46 GMT
ఎన్నిక‌ల కాక ఏపీలో మొద‌లైంది. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాకున్నా.. అన్ని రాజ‌కీయ పార్టీలు రానున్న ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్లుగా త‌మ స‌భ‌ల్ని.. స‌మావేశాల్ని నిర్వ‌హిస్తున్నాయి. సుదీర్ఘ పాద‌యాత్ర అనంత‌రం విశ్రాంతి అన్న‌ది లేకుండా మ‌ళ్లీ ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతున్న జ‌గ‌న్.. తాజాగా తిరుప‌తిలో స‌మ‌ర శంఖార‌వం పేరుతో భారీ స‌భ‌ను ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో పాటు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పైనా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తిరుప‌తి సాక్షిగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌ని చెప్పిన మోడీ.. ప్ర‌ధాని అయ్యాక ప‌ట్టించుకోలేద‌న్నారు. ప‌దేళ్ల పాటు హోదా ఇస్తామ‌ని పార్ల‌మెంటులో చెప్పిన బీజేపీ.. ఆ త‌ర్వాత ఆ విష‌యాన్నే ప‌ట్టించుకోలేద‌న్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో మోడీ.. చంద్ర‌బాబుల‌తో క‌లిసి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తిరిగార‌ని.. ప్ర‌తి ఊరు తిరిగిన ఆయ‌న‌.. నాలుగేళ్లు క‌లిసి ప‌ని చేశార‌న్నారు. హోదా తెచ్చే బాధ్య‌త‌.. పూచీ త‌న‌ద‌న్న ప‌వ‌న్ త‌ర్వాత ఆ విష‌యాన్నే వ‌దిలేశార‌న్నారు. అన్ని ప‌నులు చేస్తామ‌ని చెప్పిన ప‌వ‌న్ మోసం చేశార‌ని.. అందుకే ఎవ‌రిని న‌మ్మొద్ద‌న్నారు. త‌మ పార్టీ పాతిక ఎంపీ స్థానాలు గెలిస్తే.. మ‌న‌కు మ‌న‌మే హోదా తెచ్చుకునే వీలుంద‌న్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోవ‌టం లేద‌ని.. ఒంట‌రిగా పోటీ చేస్తున్న‌ట్లు జ‌గ‌న్ వెల్ల‌డించారు. మ‌రో నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలో ఎన్నిక‌లు రానున్నాయ‌ని.. త‌మ పార్టీని గెలిపించే బాధ్య‌త ప్ర‌జ‌ల‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చే బాధ్య‌త త‌న‌దేన‌న్న ఆయ‌న‌.. ప్ర‌స్తుతం రూ.2వేల‌కు ఉన్న పెన్ష‌న్ క్ర‌మ‌ప‌ద్ద‌తిలో పెంచుతూ.. రూ.3వేల‌కు తీసుకుపోనున్న‌ట్లు చెప్పారు.

హోదా పేరుతో బాబు డ్రామాలు ఆడుతున్నార‌ని.. న‌ల్ల‌చొక్కాలు వేసుకుంటే హోదా రాద‌న్న జ‌గ‌న్‌.. ఓట‌మి భ‌యంతోనే బాబు ఏదేదో హామీలు ఇస్తున్న‌ట్లు చెప్పారు. స‌ర్వే పేరుతో రాష్ట్రంలో ఓట్ల‌ను బాబు స‌ర్కారు తొల‌గిస్తుంద‌న్నారు. 20 ల‌క్ష‌ల మంది తెలంగాణ వాళ్లు ఏపీలో ఉన్నార‌ని.. 29.18 ల‌క్ష‌ల మందికి రెండు ఓట్లు ఉన్న‌ట్లు చెప్పారు.
Tags:    

Similar News