టాలీవుడ్ ప్రముఖులకు షాకిచ్చిన జగన్

Update: 2019-11-10 05:23 GMT
ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా..? ఇది పాపులర్ డైలాగ్.. అలా జగన్ పార్టీలోకి ఎన్నికల ముందర వచ్చిన సినీ ప్రముఖులు ఎంతో మంది. అలా వచ్చి సీట్లు సంపాదించి లేదా గెలిచాక నామినేటెడ్ పదవులు పొందుదామని కలలుగన్న వారు ఎంతో మంది. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం మరువలేదు. గెలుపు ముందర వచ్చిన వారు ఎవరు.. తనతోపాటు పార్టీ పెట్టినప్పటినుంచి కలిసి నడిచిన వారు ఎవరో గుర్తించారు. తాజాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

పార్టీ పెట్టినప్పటి నుంచి తనతోపాటు కలిసినడిచిన దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి సీఎం జగన్ ఇటీవలే తెలుగు అకాడమీ చైర్మన్ పదవి కట్టబెట్టి ఆమెకు గౌరవాన్ని ఇచ్చారు. అది మరిచిపోకముందే తాజాగా ఎంతో మంది పోటీపడుతున్న కీలక పదవి అయిన ‘ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి’ని సీనియర్ యాక్టర్ విజయ్ చందర్ కు ఇచ్చి జగన్ అందరికీ షాకిచ్చారు.

ప్రధానంగా ఈ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని టాలీవుడ్ లోని చాలా మంది ఆశిస్తున్నారు. ఎన్నికల ముందర జగన్ పార్టీలో చేరిన అలీ, జీవితా రాజశేఖర్, మోహన్ బాబు, జయసుధలకు దక్కుతాయని అందరూ భావించారు. కానీ ఎన్నికల ముందర వచ్చిన వారు కాదని.. పార్టీ ఏర్పాటు నుంచి తనతో కలిసి నడిచిన నటుడు విజయ్ చందర్ కు జగన్ ఈ పదవి ఇవ్వాలని డిసైడ్ కావడం టాలీవుడ్ ప్రముఖులకు షాకిచ్చినట్టే కనిపిస్తోంది.

విజయ్ చందర్.. సినిమాల్లో సాయిబాబాగా, కరుణామయుడు ఏసుగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఈయన ఆధ్యాత్మిక సినిమాల్లో తప్పితే పెద్దగా కనిపించలేదు. అయినా జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతో ఉన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో, షర్మిళ పాదయాత్ర వేళ.. ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీకి మద్దతుగా విజయ్ చందర్ పాల్గొన్నారు. జగన్ పట్ల తన విధేయత చాటాడు. తొలి నుంచి తనతోపాటు ఉన్న విజయ్ చందర్ కే జగన్ ఈ పదవి కట్టబెట్టి తన గొప్ప మనసును చాటుకోవడం విశేషం. జగన్ నిర్ణయంపై పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. టాలీవుడ్ ప్రముఖులు మాత్రం షాక్ కు గురయ్యారనే చెప్పాలి.

ప్రధానంగా పోసాని, అలీకి ఈ ఫిలిం కార్పొరేషన్ పదవి దక్కుతుందని బాగా ఆశలు పెంచుకున్నారు. పోసాని జగన్ కు మద్దతుగా బాగా మాట్లాడారు. ఇటీవలే ఆయనకు పదవి ఖాయమని ప్రచారం సాగింది. అనారోగ్యంతో ఉన్న ఈయనను వైసీపీ నేతలు కలిసినప్పుడు తాను కోలుకున్నానని.. జగన్ అవసరం ఉందనుకుంటే పదవి ఇస్తారంటూ పోసాని కామెంట్ చేశారు. అయితే పదవులు ఇవ్వకపోవడంతో ఇటీవల కాలంలో మౌనంగా ఉంటున్నారని తెలుస్తోంది. జగన్ ను టాలీవుడ్ ప్రముఖులు సీఎంగా గుర్తించడం లేదన్న నటుడు ఫృథ్వీ కామెంట్స్ కు పోసాని కౌంటర్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే పోసానికి పదవి దక్కకపోవడం.. అలీకి కూడా ఈ పదవి దరిచేరకపోవడం.. ఎవ్వరూ ఊహించని విధంగా జగన్... ‘విజయ్ చందర్’కు పదవి ఇవ్వడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది
Tags:    

Similar News