జగన్ లో ఉన్నట్లుండి ఈ మార్పేంటి?

Update: 2016-03-22 10:00 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అన్న ముద్ర పడిపోయింది. ఆ పార్టీ తరఫున గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేలు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. పైగా పార్టీలో కూడా వాళ్లదే ఆధిపత్యం. ఇక రెడ్లు - కాపులకు సహజంగానే దోస్తీ కాబట్టి.. ఆ సామాజిక వర్గాన్ని కూడా కొంత వరకు ఆకర్షించింది వైకాపా. అందులోనూ తాజా పరిణామాల నేపథ్యంలో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి చాలా ప్రయత్నాలే చేశాడు జగన్. ఆ విషయంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు కూడా.

ఐతే కమ్మ సామాజిక వర్గం మాత్రం ఆ పార్టీకి ముందు నుంచి దూరమే. జగన్ కూడా కమ్మ సామాజికవర్గాన్ని ఆకర్షించడానికి పెద్దగా ప్రయత్నాలు కూడా చేయలేదు. కమ్మలు సహజంగానే తనకు వ్యతిరేకులని భావించి ఆ సామాజిక వర్గం మీద పెద్దగా దృష్టిపెట్టలేదు. ఐతే ఇలా ఒక బలమైన సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరిస్తే కష్టం అనుకుని.. ఇప్పుడు జగన్ స్ట్రాటజీ మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉన్నట్లుండి వైకాపా అధ్యక్షుడు కమ్మ సామాజిక వర్గం మీద దృష్టిపెడుతున్నాడు.

విజయవాడలో బలమైన కమ్మ నేతల్లో ఒకరైన దేవినేని నెహ్రూను ఆయన తన పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అటు వైపు నుంచి కూడా అంగీకారం కుదిరింది. కానీ కాపు నేత అయిన వంగవీటి రాధా జగన్ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఐతే దేవినేని నెహ్రూ వద్దంటే.. ఇంకెవరైనా బలమైన కమ్మ నేతల్ని పార్టీలోకి తీసుకురమ్మని జగన్ చెబుతున్నాడట. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికే చెందిన కొడాలి నానికి ఈ మధ్య బాగా ప్రాధాన్యమిస్తున్నాడు జగన్. ఇంతకుముందు స్ట్రాటజీల విషంయలో మొండిగా వెళ్లిపోయే జగన్.. ఈ మధ్య కొందరు నేతల సలహాల్ని పాటించి ఇలా కమ్మలపై సడెన్ ప్రేమ కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News