యంగ్ జ‌గ‌న్‌..యంగ్ లీడ‌ర్స్

Update: 2018-09-28 10:33 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ యువ మంత్రం జ‌పిస్తున్నారా? ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో యువ‌త‌కు ఆయ‌న పెద్ద‌పీట వేయ‌బోతున్నారా? వారికి ఎక్కువ సీట్లు కేటాయించనున్నారా? ఈ ప్రశ్న‌ల‌న్నింటికీ అవును అనే స‌మాధానం చెబుతున్నారు విశ్లేష‌కులు.

జ‌గ‌న్ స్వ‌యంగా యువ‌నేత‌. త‌క్కువ వ‌య‌సులోనే రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఆయ‌న బాధ్య‌త‌లు భుజాల‌కెత్తుకున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌ర‌ఫున ఎక్కువ మంది యువ‌త‌ను అసెంబ్లీకి పంపించాల‌ని ఆయ‌న యోచిస్తున్నారు. ఇందులో భాగంగా త‌న ఆలోచ‌నా ధోర‌ణికి అనుగుణంగా న‌డుచుకునే యువ నాయ‌కుల కోసం జ‌గ‌న్‌ అన్వేషిస్తున్న‌ట్లు తెలిసింది. అలాంటి యువ నేత‌లు పార్టీలో అధిక సంఖ్య‌లో ఉండ‌టంతో.. వారి విజ‌యావ‌కాశాల‌పై స‌ర్వే చేయిస్తున్న‌ట్లు స‌మాచారం.

 జ‌గ‌న్ యువ నాయ‌కుల వైపు మొగ్గు చూపుతుండ‌టం వెన‌క ప్ర‌ధాన కార‌ణం ఒక‌టుంద‌ని రాజ‌కీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదేంటంటే.. యువ‌కులు ఒక్క‌సారి పార్టీని న‌మ్ముకుంటే ఎన్ని క‌ష్టాలు ఎదురైనా వెనుదిరిగి చూడ‌రు. పార్టీని అట్టిపెట్టుకునే ఉంటారు. ప్ర‌లోభాల‌కు లొంగ‌రు. ఫిరాయింపుల‌కు పాల్ప‌డ‌రు. ఈ విష‌యంలో సీనియ‌ర్లతో కాస్త ఇబ్బంది ఉంటుంది. కొంత మంది సీనియ‌ర్ నాయ‌కులు అవ‌స‌రానికి అనుగుణంగా పార్టీ మారుతుంటారు. ఈ సంగ‌తి జ‌గ‌న్‌కు ఇప్ప‌టికే అర్థ‌మైంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న వెంట ఉన్న ప‌లువురు సీనియ‌ర్లు.. త‌ద‌నంత‌ర కాలంలో అధికార పార్టీలోకి చేరారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా తాను చేప‌ట్టిన పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేయ‌డంలోనూ.. ఆయా నియోక‌వ‌ర్గంలో కొంద‌రు యువ‌నేత‌లు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం జ‌గ‌న్ గ‌మ‌నించారు. అందుకే యువ‌త‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.

 సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేస్తున్న ప్ర‌శాంత్ కిశోర్ కూడా యువ మంత్ర‌మే జ‌పిస్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలోని అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌శాంత్ బృందం వ‌డ‌పోత నిర్వ‌హించింది. అందులోనే యువ నాయ‌కుల పేర్లే ఎక్కువ‌గా వినిపించాయి. వారికే విజ‌యావ‌కాశాలు అధికంగా ఉన్న‌ట్లు తేలింది. సొంత అభిప్రాయంతోపాటు స‌ర్వేల్లో తేలిన విష‌యాలూ ఒకేలా ఉండ‌టంతో జ‌గ‌న్ యువ‌త‌ వైపు మ‌రింత మొగ్గు చూపుతున్నారు.

 యువ‌త‌కు పెద్ద పీట వేయ‌డంలో భాగంగా జ‌గ‌న్ ఇప్ప‌టికే నంధ్యాల టికెట్‌ ను సీనియ‌ర్ నాయ‌కులు శిల్పా చ‌క్ర‌వాణి కుమారుడు శిల్పా ర‌వికి ఖ‌రారు చేశార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆళ్ల‌గ‌డ్డ‌లోనూ గంగుల విజ‌యేంద్ర‌రెడ్డి అలియాస్ నానిని బ‌రిలోకి దించాల‌ని జ‌గ‌న్ యోచిస్తున్నార‌ట‌. అయితే, గెలుపు అవ‌కాశాల‌పై స‌ర్వేలో కొంత ప్ర‌తికూల ఫలితాలు రావ‌డంతో పున‌రాలోచ‌న‌లో ప‌డిన వైసీపీ అధినేత‌.. అక్క‌డ రీ స‌ర్వే చేయిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 టికెట్ల విష‌యంలో యువ‌త‌కు ప్రాధాన్య‌మిచ్చినా.. సీనియ‌ర్ల‌ను ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయొద్ద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వారి అనుభ‌వాన్ని పార్టీ ఎదుగుద‌ల‌లో ఉప‌యోగించుకోవాల‌ని.. త‌ద‌నుగుణంగా పార్టీలో కీల‌క‌ ప‌ద‌వుల‌ను వారికి క‌ట్ట‌బెట్టాల‌ని ఆయ‌న ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు స‌మాచారం. అదే స‌మ‌యంలో కొంద‌రు సీనియ‌ర్ల‌కు టికెట్ల విష‌యంలోనూ ఏమాత్రం ఢోకా ఉండ‌బోద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.


Tags:    

Similar News