వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ తో జ‌గ‌న్ ప్ర‌భుత్వ డీల్?

Update: 2021-07-09 17:30 GMT
అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మూడు రాజ‌ధానుల కాన్సెప్టులో భాగంగా బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం పాల‌నారాజ‌ధానిగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నాటి నుంచి విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ విస్త‌ర‌ణ కోసం భూముల‌ను సేక‌రిస్తోంది. మెజారిటీ భాగం భీమిలి నుంచి రుషికొండ మ‌ధ్య‌లో కీల‌క‌మైన కార్యాల‌యాల‌ను విస్త‌రించే ప్లాన్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉంది. బీచ్ టూరిజం అభివృద్ధి స‌హా ఇత‌ర‌త్రా ప్ర‌ణాళిక‌ల కోసం వేల కోట్ల‌ను కేటాయిస్తోంది.

ఇక క్యాపిట‌ల్ ప్లానింగ్ లో భాగంగా విశాఖ సముద్ర తీరంలో ఉన్న రామానాయుడు ఫిలింస్టూడియోస్ స్థ‌లాన్ని ప్ర‌భుత్వం రాజ‌ధాని కోసం కోరుతున్న‌ట్టు ప్ర‌ముఖ ప‌త్రిక‌లో సంచ‌ల‌న క‌థ‌నం వెలువ‌డింది. నాటి ప్ర‌భుత్వాలు రామానాయుడు స్టూడియోస్ కోసం ఇచ్చిన 35 ఎక‌రాలను ఇచ్చేస్తే వేరే చోట అదే భూమిని కేటాయించేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆఫ‌ర్ చేసింద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం మంత‌నాలు సాగుతున్నాయని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది.

విశాఖ బీచ్ ప్రాంతంలో తిమ్మాపురం స‌మీపంలో 2002లో కొండ భూమిని రామానాయుడు స్టూడియోస్ కి కేటాయించ‌గా అందులో 2008లో స్టూడియో నిర్మాణం పూర్త‌యింది. ప్ర‌స్తుతం ఈ స్టూడియోలో షూటింగులు జ‌రుగుతున్నాయి. అయితే ఈ స్థ‌లాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క్కి ఇవ్వాల‌ని కోర‌డంపై ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ విశాఖ న‌గ‌రంలో ఫిలిం స్టూడియోల నిర్మాణానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏ ప్రాంతంలో స్థ‌లాలు ఇస్తుంది?  సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల‌కు స్థ‌లాలిచ్చే ఆలోచ‌న లో ఉందా లేదా? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త లేదు. మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో సినీపెద్ద‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని స్టూడియోల కోసం స్థ‌లాలు అడిగిన సంగ‌తి తెలిసిందే. దీనిపై మునుముందు మ‌రిన్ని చ‌ర్చ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. రాజ‌ధాని నిర్మాణంపై క్లారిటీ వ‌చ్చేస్తే అటుపై విశాఖ టాలీవుడ్ విస్త‌ర‌ణ పైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వం దృష్టి పెట్ట‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.
Tags:    

Similar News