ఏపీ విద్యపై జగన్ మార్క్.. ఇకపై రివర్స్ టెండరింగ్

Update: 2019-10-01 09:58 GMT
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జగన్ ప్రస్తావించిన కొన్ని ముఖ్యంశాల్లో విద్య ఒకటి. తన పాలనలో విద్య ఎలాంటి మార్పులు చోటు చేసుకోనుందన్న విషయాన్ని తాను చూపిస్తానని.. పాఠశాలలు.. వాటి మౌలిక సదుపాయాల విషయంలోనూ పెను మార్పులు చోటు చేసుకోనున్న విషయాన్నిచెప్పారు. స్కూల్ ఫోటోలు తీసుకోండి.. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత చూడండి.. ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో మీకే తెలుస్తుందన్నారు.

తన మాటలకు తగ్గట్లే.. జగన్ ప్రభుత్వం విద్యాశాఖలో పెను మార్పులు తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పథకాల నిర్వహణలో చోటు చేసుకునే లోపాలతో ప్రజాధనం పక్కదారి పట్టకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని విద్యాశాఖలోనూ అమలు చేయాలని భావిస్తున్నారు.

ఇదే విషయాన్ని తాజాగా ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. రివర్స్ టెండరింగ్ తో ఖర్చు తగ్గిస్తామని.. ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా కాపాడుతామని ఆయన చెబుతున్నారు.  ప్రకాశం జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియామకపు పత్రాలు అందజేసే క్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వం ప్రభుత్వ నిధుల్ని దోచుకుందన్న ఆరోపణ చేసిన ఆయన.. గ్రామ సచివాలయాలతో ప్రజలకు సకాలంలో సేవలు అందటం ఖాయమన్నారు. ఇప్పటివరకూ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ మీద ఫోకస్ చేసిన జగన్ ప్రభుత్వం.. విద్యలోనూ రివర్స్ టెండరింగ్ తో విలువైన ప్రజాధనాన్ని కాపాడుతామని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News