జగన్ ఒక్కడే బ్యాటింగ్ చేస్తారా?

Update: 2016-03-15 07:36 GMT
ఏపీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిన జగన్.. సోమవారం నాన్ స్టాప్ గా ప్రసంగించటం తెలిసిందే. ఏపీ అధికారపక్షం తరఫున పదుల సంఖ్యలో నేతలు మాట్లాడితే.. విపక్షం తరఫున జగన్ ఒక్కరే సమాధానం చెప్పటం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ అధికారపక్షం జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ.. అవిశ్వాస తీర్మానం మీద సొంత పార్టీ నేతలకు సైతం మాట్లాడే అవకాశం జగన్ ఇవ్వటం లేదని ఆరోపించారు.

అయితే.. చర్చను తాను అనుకున్న విధంగానే సాగాలన్న ఉద్దేశంతోనే జగన్.. తానొక్కరే మాట్లాడాలని నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. మిగిలిన నేతలు మాట్లాడే క్రమంలో ఏదైనా తప్పులు దొర్లినా.. లేనిపోని తప్పులు చేస్తే మరింత ఇబ్బందులు తప్పవన్న ముందస్తు జాగ్రత్తతోనే పార్టీలోని మిగిలిన నేతలకు అవకాశం ఇవ్వలేదన్న వాదన వినిపిస్తోంది. ఈ సందర్భంగా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

జగన్ ను అనుకూలంగా వాదిస్తున్న వారు సోమవారం అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఒంటరిపోరాటం చేశారని.. జగన్ ఒక్కడే అయినప్పటికీ అధికారపక్షానికి చుక్కలు చూపించారని.. పలువురు నేతలు బ్యాలెన్స్ కోల్పోయేలా టెంప్ట్ చేయటంలో ఆయన సక్సెస్ అయ్యారన్న వాదన వినిపిస్తోంది. అదేసమయంలో జగన్ ను విమర్శించే వర్గం మాత్రం.. జగన్ ఎంచుకున్న మార్గం సరికాదని తేల్చి చెబుతున్నారు.

కీలకమైన అవిశ్వాస తీర్మానం సందర్భంగా తన పార్టీకి చెందిన నేతలు ఎవ్వరితోనూ మాట్లాడించకపోవటం చూస్తే.. ఆయనకు వారి మీద నమ్మకం లేనట్లుగా కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమర్థంగా మాట్లాడే నేతలు ఉన్నప్పటికీ.. తాను ప్రముఖంగా కనిపించాలన్న ఉద్దేశంతోనే జగన్ మిగిలిన వారెవరికీ అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు. ఒక్క వ్యక్తి అన్నేసి గంటలు మాట్లాడటం వల్లనే.. మధ్యలో బ్యాలెన్స్ కోల్పోయి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని.. తప్పులు చేశారని.. అదే మిగిలిన సభ్యుల చేత కూడా మాట్లాడించి ఉంటే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది. ఏమైనా.. జట్టు మొత్తం తన మీదనే ఆధారపడాలని ఏ జట్టు కెప్టెన్ భావించడు. నిజమైన నాయకుడు తనలాంటి వారిని పది మందిని తయారు చేసుకోవాలనుకుంటారు. అదే నాయకత్వ లక్షణం కూడా. కానీ.. జగన్ లాంటి వ్యక్తి.. తన లాంటి వారిని తయారు చేసుకోవటానికి అంగీకరిస్తారా?
Tags:    

Similar News