జగన్ ప్లాన్ లో భాగమే శంకుస్థాపన గైర్హాజరీ?

Update: 2015-10-19 12:36 GMT
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ పాల్గొనకపోవటం వెనుక పెను వ్యూహం ఉందా? జగన్ వ్యూహకర్తలు ఎంతగానో మదించి.. చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారా? భవిష్యత్తు రాజకీయ వ్యూహంలో భాగంగానే జగన్ శంకుస్థాపన కార్యక్రమానికి రాకుండా ఎగనామం పెడుతున్నారా? అన్న ప్రశ్నలకు జగన్ పార్టీకి చెందిన ఒక నేత చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

తన పేరు.. వివరాలు ఎట్టి పరిస్థితుల్లో వెల్లడించొద్దన్న మాట మీద పలు అంశాల మీద తన అభిప్రాయాన్ని చెప్పిన సదరునేత.. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ హాజరు కాకపోవటం రాజకీయంగా తీసుకున్న నిర్ణయమే తప్పించి మరొకటి కాదని స్పష్టం చేస్తున్నారు.

లక్ష కోట్ల అవినీతి అని.. రైతుల భూముల బలవంతంగా సేకరించారన్న కారణంగానో కాదని.. భవిష్యత్తు వ్యూహంలో భాగంగా శంకుస్థాపన కార్యక్రమంలో రావటం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ హాజరు కావటం అంటే.. ఆ కార్యక్రమం వరకూ జరిగిన అన్ని పనులకు జగన్ హాజరీతో ఆమోదముద్ర పడినట్లుగా అవుతుందన్న ఆలోచనే జగన్ ను శంకుస్థాపనకు రాకుండా చేశాయని చెబుతున్నారు.

ఏపీ రాజధానినిర్మాణానికి సంబంధించి సేకరించిన భూముల సేకరణ విషయంలో మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్.. ఇప్పుడు కానీ శంకుస్థాపనకు వెళితే.. గతంలో తానుచేసిన విమర్శలు.. ఆరోపణలకు విలువ లేనట్లుగా అయ్యే అవకాశం ఉందన్న ఆలోచనలో రావటం మానేసినట్లుగా చెబుతున్నారు. అన్నింటికి మించి శంకుస్థాపన కార్యక్రమం అనంతరం నిర్మాణం మొదలు కాగానే.. భారీ అవినీతి బయటకు వస్తుందని.. భూముల కేటాయింపులో పక్షపాతం చోటుచేసుకోవటం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది.

ఆ రోజున చేసే ఆరోపణలు బలంగా.. సీమాంద్ర ప్రజలు అవుననేలా ఉండటం కోసమే జగన్ అమరావతికి వెళ్లటం లేదని చెబుతున్నారు. భవిష్యత్తులో చేసే రాజకీయ పోరాటాలకు ఏపీ రాజధాని శంకుస్థాపనకు గైర్హాజరు కాలేదన్న విషయాన్ని గుర్తు చేయటం ద్వారా రాజకీయ లబ్థి పొందాలన్నది ఆలోచనగా చెబుతున్నారు. చంద్రబాబుసర్కారు చేపట్టే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని.. ఆ కారణంతోనే శంకుస్థాపనకు వెళ్లలేదన్న వాదనను చెప్పుకునేందుకు వీలుగా గైర్హాజరు అయినట్లు అభిప్రాయం కలిగేలా ఉండాలనే డుమ్మా కొట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.

అమరావతి శంకుస్థాపనకు డుమ్మా కొట్టటం ఉడుకుమోతుతనంతో కాదన్న మాటను అందరికి అర్థమయ్యేలా చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. జగన్ వ్యూహం ఎంతవరకు వజయవంతం అవుతుందో చూడాలి.
Tags:    

Similar News