జగన్ 2.0 : అయిననూ అలక వీడకుండే !

Update: 2022-04-13 11:30 GMT
అల‌క‌లు కార‌ణంగా వైసీపీలో మార్పులు రావు అని తేలిపోయిందా? బ‌ల‌మ‌యిన స్థాయిలో వైసీపీ ఉందా? అంటే ఎవ్వ‌రినైనా త‌న దార్లోకి తెచ్చుకునేంత స్థాయిలో అధిష్టానం చ‌ర్య‌లు స‌ఫ‌లీకృతం అవుతున్నాయా? ప్ర‌ధానంగా ముఖ్య‌మంత్రి స్థాయిలో చేసే స‌మాలోచ‌న‌లు ఇవేనా? ఇవే ప్ర‌శ్న‌లు స‌చివాల‌యంలో..! ఇవే ప్ర‌శ్న‌లు సీఎంఓలో..! ఇవే ప్ర‌శ్న‌లు వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో...?

మాజీ హోం మంత్రి మేక‌తోటి సుచరిత స‌మస్య మాత్రం ప‌రిష్కారం కావ‌డం లేదు. ఆమెను ఓదార్చే వ్య‌క్తులు కానీ లేదా ఆమెను ప‌ల‌క‌రించే పెద్ద స్థాయి నాయ‌కులు కానీ లేరు. ఆ రోజు మోపిదేవి వ‌చ్చి వెళ్లిన త‌రువాత పెద్ద‌గా మార్పులేవీ చోటు చేసుకోలేదు. ఆమెతో పాటు అసంతృప్తితో ర‌గిలిపోయిన మిగ‌తా నాయ‌కులయిన పిన్నెల్లి, బాలిలేని, సామినేని లాంటి వారికి ముఖ్య‌మంత్రి నుంచి స్ప‌ష్ట‌మ‌యిన భ‌రోసా ద‌క్కింది.

కానీ ఆమెకు మాత్రం ఎవ‌రి త‌ర‌ఫునా కూడా ఇంత‌వ‌ర‌కూ ఏ విధం అయిన సంప్ర‌తింపులూ లేవు. ఆఖ‌రికి ఆమె ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన వైనాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారా అన్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది. లేదా కొంత స‌మ‌యం ఇచ్చి ఆ త‌రువాత పార్టీ త‌ర‌ఫున ఎవ్వ‌రైనా ఆమె ఇంటికి వెళ్లి మాట్లాడి వ‌స్తారా అన్న‌ది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమ‌యినా అల‌కలు కొన్ని ప్ర‌స్తుత ప‌రిణామాల్లో ప్ర‌తిష్టంభ‌న‌కు దారి తీస్తున్నాయి.

ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ప్ర‌క్రియ పూర్త‌యినా ఇంకా స‌మ‌స్య‌లు మాత్రం అలానే ఉన్నాయి. కొన్ని చోట్ల హెచ్చు స్వ‌రాలు పైకి వినిపించ‌డం లేదు కానీ లోలోప‌ల అంత‌ర్మ‌థ‌నాలు మాత్రం అలానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న త‌ర‌ఫున చెప్పాల్సిన‌దంతా చెబుతూనే ఉన్నారు. చెప్పించించాల్సిన‌దంతా చెప్పిస్తూనే ఉన్నారు. అయినా కూడా కొన్ని స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగానే ఉన్నాయి. పార్టీ మార్పు లాంటి పెద్ద పెద్ద నిర్ణ‌యాలు ఏవీ వెల్ల‌డిలో లేక‌పోయినా ఉన్నంత‌లో తాము మౌనం దాల్చి త‌మ అవ‌స‌రం వచ్చిన‌ప్పుడు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచ‌న‌లు కూడా కొంద‌రు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

ఇంకొంద‌రు మాత్రం బాహాటంగానే వ్యంగ్య ధోర‌ణిలోనే మాట్లాడుతూ త‌మ‌కు ప్రేమ, అభిమానం పంచిన వారికి రెట్టించిన స్థాయిలో ఇస్తామ‌ని తిరిగి ఇచ్చేందుకు తాము ఎన్నడూ వెన‌కాడబోమ‌ని అనిల్ కుమార్ యాద‌వ్ వంటి యువ నాయ‌కులు స్పందించడం, అందులోనూ జ‌గ‌న్ వీర విధేయులుగా ఉన్న వర్గంలోని వ్య‌క్తులే ఈ విధంగా మీడియా ఎదుట కాస్త వ్యంగ్యోక్తులు మాట్లాడ‌డంతో పార్టీలో ఇప్ప‌టికిప్పుడు ఏ మార్పూ జ‌ర‌గ‌క‌పోయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో  మాత్రం కొంద‌రు త‌మ స‌త్తా చాటుకునేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నార‌న్న మాట మాత్రం వాస్త‌వం.

ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతానికి ఏ ముస‌లానికి లేదా త‌క్ష‌ణ సంక్షోభానికి తావే లేకున్నా క‌నీసం స‌ర్పంచ్ స్థాయి వ్య‌క్తి రాజీనామా కూడా ఆమోదంలోనో లేదా ప‌రిగ‌ణ‌న‌లోనో లేకున్నా రేప‌టి వేళ అంద‌రి అసంతృప్తత‌లూ వెల్ల‌డిలోకి రావ‌డం త‌థ్యం.ఈ నేప‌థ్యంలో మాజీ హోం మంత్రి మేక‌తోచి సుచ‌రిత వ్య‌వ‌హారం మాత్రం అస్సలు ఓ కొలిక్కి రావ‌డం లేదు. ఆమె ప‌ట్టు వీడ‌డం లేదు. అయినా పార్టీ త‌ర‌ఫున సంప్ర‌తింపులు అన్న‌వి లేనే లేవ‌ని తేలిపోయింది. ప్ర‌భుత్వ పెద్ద స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి ఫోన్ చేసినా స‌రే కలిసేందుకు అనారోగ్య కార‌ణాల రీత్యా వెళ్ల‌లేద‌ని ప్ర‌ధాన మీడియా  వెల్ల‌డిస్తోంది. అంటే ఆమె తిర‌స్కారాన్ని పార్టీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుందా? అన్న అనుమానాలూ వ్య‌క్తం అవుతున్నాయి.
Tags:    

Similar News