వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌రాలు వ‌ర‌దేనా?

Update: 2017-11-10 04:41 GMT
ఏడాదిన్న‌ర త‌ర్వాత పీక్స్ కు చేరాల్సిన ఎన్నిక‌ల వేడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇప్పుడే మొద‌లైంది. ప్ర‌జా సంక‌ల్పం పేరిట ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్వ‌హిస్తున్న పాద‌యాత్ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంద‌రూ ఊహించిన‌ట్లే.. పాద‌యాత్ర బ్ర‌హ్మాండంగా సాగుతోంది. జ‌గ‌న్‌ కు నీరాజ‌నాలు ప‌డుతున్న‌ట్లుగా ఆయ‌న వెంట పోటెత్తుతున్నారు.

ప్ర‌జా స‌మూహాన్ని చూసి ఉత్సాహంతో ఉర‌క‌లెత్తుతున్న జ‌గ‌న్‌.. వ‌రాల వ‌ర్షం కురిపిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో తానేం త‌ప్పు చేశానో.. ఆ త‌ప్పు మ‌ళ్లీ రిపీట్ కాకుడ‌ద‌న్న ల‌క్ష్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఏ వ‌ర్గాన్ని వ‌ద‌ల‌కుండా.. అన్ని వ‌ర్గాల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన హామీల‌తో ప్ర‌జ‌ల్లో కొత్త చ‌ర్చ‌కు తెర తీస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయ‌న దృష్టి రైతుల మీద ప్ర‌ధానంగా ఉంద‌ని చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా అన్న‌దాత‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య గిట్టుబాటు ధ‌ర‌. దీనిపై ఫోక‌స్ చేసిన జ‌గ‌న్‌.. గిట్టుబాటు ధ‌ర‌కు భారీ హామీనే ఇచ్చేశారు.  ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిని ఏర్పాటు చేస్తాన‌ని.. పంట మార్పిడికి ముందే రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పిస్తాన‌ని పేర్కొన్నారు. ముందే తాము మ‌ద్ద‌తు ధ‌ర‌లు ప్ర‌క‌టిస్తామ‌ని.. అంత‌కంటే త‌క్కువ ధ‌ర‌కు అమ్మే ప‌రిస్థితి రాకుండా చూస్తామ‌ని.. ఒక‌వేళ అలాంటిదే వ‌స్తే త‌మ ప్ర‌భుత్వ‌మే కొంటుంద‌ని భ‌రోసా ఇవ్వ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

న‌వ‌ర‌త్నాల పేరుతో ఇస్తున్న హామీలు తెలుగు త‌మ్ముళ్ల‌లో హాట్ టాపిక్ గా మారిన వేళ‌.. వాటికి మించి.. అన్ని వ‌ర్గాల‌కు ఒక్కో వ‌రం ఇస్తున్న జ‌గ‌న్ తీరు అధికార‌ప‌క్షంలో కొత్త గుబులు పుట్టిస్తోంది. గురువారం పాద‌యాత్ర సంద‌ర్భంగా య‌ర్ర‌గుంట్ల‌కు చేరిన జ‌గ‌న్ కు అపూర్వ‌స్వాగ‌తం ల‌భించింది.  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.42 ల‌క్ష‌ల ఉద్యోగాల్ని అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. కాంట్రాక్ట్ కార్మికుల‌ను సైతం ప‌ద్ధ‌తి ప్ర‌కారం క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తామ‌ని చెబుతున్నారు.

రైతు భ‌రోసా కింద ప్ర‌తి రైతుకు రూ.50వేలు ఇస్తామ‌ని.. గిట్టుబాటు ధ‌ర‌ల్ని ముందే ప్ర‌క‌టించ‌టం ద్వారా రైతుల‌కు తాము పండించే పంట‌కు క‌చ్ఛితమైన హామీతో కూడిన మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించేలా చేస్తామ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందు.. పాద‌యాత్ర సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తున్న హామీలు ఒక ఎత్తు అయితే.. ఎన్నిక‌ల వేళ‌కు మ‌రిన్ని ఆక‌ర్ష‌ణీయ‌మైన ఎన్నిక‌ల హామీలు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు.

దీంతో.. ఏపీ అధికార‌ప‌క్షంలో కొత్త గుబులు పుట్టుకొచ్చింది. అన్ని హామీలు జ‌గ‌న్ నోటి నుంచి వ‌చ్చేస్తే.. త‌మ అధినేత మ‌రెలాంటి హామీలు ఇస్తార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇవ్వాల్సిన దాని కంటే రెండింత‌లు ఎక్కువ‌గా హామీలు ఇచ్చేస్తున్న జ‌గ‌న్‌ కు మించి హామీ ఇవ్వ‌టం సాధ్యం కాదు. ఒక‌వేళ‌.. ఇచ్చినా ప్రాక్టిక‌ల్ గా అనిపించ‌దు. ఇప్ప‌టికే 2014 ఎన్నిక‌ల్లో బాబు ప్ర‌ధానంగా ఇచ్చిన  ప్ర‌తిఒక్క‌రికి జాబు.. జాబు రాకుంటే నిరుద్యోగ భృతి లాంటి ప్ర‌ధాన హామీలు నెర‌వేర‌లేదు.

ఇలాంటి వేళ‌లో ఏ ముఖం పెట్టుకొని మ‌ళ్లీ హామీలు ఇవ్వ‌గ‌ల‌ర‌న్న‌ది ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారింది. రైతుల రుణ‌మాపీ విష‌యంలో బాబు చెప్పింది ఒక‌టైతే.. చేసింది మ‌రొక‌టి. అన్నింటికి మించి డ్వాక్రా మ‌హిళ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న రుణ‌మాపీ విష‌యంలోనూ బాబు హ్యాండ్ ఇవ్వ‌టాన్ని ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. దీంతో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ హామీలు ఇవ్వ‌టం బాబుకు సాధ్యం కాదు. దీంతో.. విప‌క్ష నేత‌కు ధీటుగా హామీలు ఇవ్వ‌ని ప‌క్షంలో ప్ర‌చార ప‌ర్వంలో వెనుక‌బ‌డిపోవ‌టం ఖాయం. అదే జ‌రిగితే.. అధికారానికి దూర‌మైట్లే.

గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా హామీలు ఇచ్చే విష‌యంలో ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు వైఎస్ జ‌గ‌న్‌.  ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాల‌కంటే.. విభ‌జ‌న‌తో చితికిన రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని మ‌రింత మెరుగు ప‌ర్చాల‌ని ఆయ‌న భావించారు. కానీ.. నిర్మాణాత్మ‌క విధానాల కంటే ఆక‌ర్ష‌ణీయ‌మైన ప‌థ‌కాల‌కే ప్ర‌జ‌లు మ‌క్కువ ప్ర‌ద‌ర్శించిన నేప‌థ్యంలో ఈసారి హామీల ప‌ర్వం భారీగా ఉండాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ కార‌ణంతోనే.. హామీల విష‌యంలో త‌న తీరు మారింద‌న్న విష‌యాన్ని పాద‌యాత్ర మొద‌టి రోజునే చెప్పేసి జ‌గ‌న్‌.. త‌న హామీల్ని మ‌రింత‌గా పెంచేస్తున్నారు. పాద‌యాత్ర ప్రారంభంలోనే ఇలా ఉంటే.. ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి మ‌రిన్ని ఆక‌ర్ష‌ణీయ‌మైన హామీలు ఇవ్వ‌టం ఖాయం.

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఇస్తున్న హామీలు తెలుగు త‌మ్ముళ్ల‌లో క‌ల‌వ‌రం పుట్టిస్తున్నాయి. జ‌గ‌న్ నోటి నుంచి వ‌స్తున్న మాట‌లు టీడీపీ నేత‌ల‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయ‌ని చెబుతున్నారు. పాద‌యాత్ర పుణ్య‌మా అని.. ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందు నుంచే త‌మ్ముళ్ల‌కు జ‌గ‌న్ టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌. ఇందుకు త‌మ అధినేత మిన‌హాయింపు కాద‌ని త‌మ్ముళ్లు లోగుట్టుగా చెప్ప‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News