జగన్ కి బాబు కంటే కూడా ఆయన మీదనే కసి ...!

Update: 2023-01-12 02:30 GMT
ఈ విషయం వినడానికే వింతగా ఉంటుంది. ఎందుకంటే గత దశాబ్ద కాలం పైగా ఏపీ రాజకీయాలను చూసిన వారికి ఎవరికైనా చంద్రబాబు వర్సెస్ జగన్ పొలిటికల్ స్టోరీ బాగా తెలుసు. జగన్ కి బాబు కి మధ్య  రాజకీయ వైరం కాస్తా వ్యక్తిగత స్థాయిని ఏనాడో దాటిపోయింది. ఈ ఇద్దరు ఒకరి ఓటమికి మరొకరు కోరుకోవడం కాదు రాజకీయంగా ఎలిమినేషన్ని గట్టిగా కోరుకుంటున్నారు.

అలాంటి పొలిటికల్ సీన్ ఉండబట్టే పులివెందులలో ఈసారి జగన్ ఎలా గెలుస్తాడో చూస్తానని బాబు సవాల్ చేస్తూంటే జగన్ సైతం కుప్పంలో బాబు ఓటమిని గట్టిగా కోరుకుంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జగన్ కి పగలు అయినా రాత్రి అయినా బాబు గురించే ఆలోచనలు రావాలి కదా. బాబు జగన్ విషయంలో కూడా అలాగే ఆలోచిస్తారు కదా.

అంటే బాబుకు ఒక పగవారు వైసీపీలో ఉన్నారు. ఆయన మీద జగన్ కంటే ఎక్కువ కసి ఉంది. ఆయనే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఆయన ఓటమిని బాబు గట్టిగా కోరుకుంటారు. ఎంతలా అంటే ఏపీ మొత్తం టీడీపీ గెలిచినా గుడివాడలో ఓడితే మాత్రం అది బాబుకు సంతృప్తిని ఇవ్వదు అనేటంతగా.

మరి అదే రకమైన సేం ఫీలింగ్ జగన్ కి కూడా ఉందిట. వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 సీట్లు అని జగన్ అంటున్నారు. కానీ ఆయనకు తెలుసు అన్ని సీట్లు రావని, దాంతో ఆయన ప్రత్యర్ధి పార్టీలలో ప్రముఖుల మీద టార్గెట్ పెట్టి ఉంచారు. అంతే కాదు తన మీద దూషణ పర్వానికి దిగి తనను పర్సనల్ గా బాగా హర్ట్ చేసిన వారిని అయితే అసలు వదలకూడదు అని అనుకుంటున్నారుట.

ఆ హిట్ లిస్ట్ లో మొట్టమొదటి పేరుగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేరు ఉందిట. నర్శీపట్నానికి చెందిన అయ్యన్న 2019 ఎన్నికల్లో ఏకంగా 28 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓడారు. కానీ ఈసారి అక్కడ తెలుగుదేశానికి మళ్లీ బలం పెరిగింది అని అంటున్నారు. వైసీపీలో వర్గ పోరు కూడా మరో కారణం అవుతోంది.

అదే టైం లో అయ్యన్నపాత్రుడిని టార్గెట్ చేసి తెల్లవారు జామున అరెస్టులు చేయించడం వంటివి బూమరాంగ్ అయ్యాయి. ఇక ఫైర్ బ్రాండ్ అయ్యన్నకు పట్టుంది. దాంతో ఈసారి ఆయన గెలుపు అవకాశాలు పెరిగాయి. దాంతో సర్వే నివేదికలను దగ్గర పెట్టుకున్న జగన్ అయ్యన్నపాత్రుడు ఎట్టిపరిస్థితుల్లో గెలవకూడదు అని భావిస్తున్నారుట.

దానికి బలమైన కారణం జగన్ని పట్టుకుని తుగ్లక్ ముఖ్యమంత్రి అని ఫస్ట్ టైం విమర్శించిన వారే అయ్యన్న. అలాగే సైకో అన్న పేరు కూడా ఆయనే పెట్టారని అంటారు. ఇక చెత్త పన్ను వేసే సీఎం అంటూ అనుచిత భాషను అయ్యన్న వాడేశారు. ఏక వచన ప్రయోగాలు, తిట్ల దండకాలు దిగజారుడు భాష అనేక రకాలుగా అయ్యన్న జగన్ తో మాటల చెడుగుడే ఆడారు

జగన్ని వ్యక్తిగతంగా ఇంతలా తెలుగుదేశంలో టార్గెట్ చేసిన నాయకుడు మరొకరు లేరు. అందుకే అయ్యన్నను అరెస్ట్ చేయాలని కనీసం ఒక రోజు అయినా జైఇలులో ఉంచాలని వైసీపీ పెద్దలు అనుకున్నా అది సాధ్యపడలేదు. తన మీద ఏ కేసు బనాయించినా వెంటనే బెయిల్ తెచ్చేసుకుని అయ్యన్న జగన్ కి పెను సవాల్ గా మారారు. అందుకే అయ్యన్నను జగన్ టార్గెట్ చేశారు అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో అయ్యన్న గెలవకూడదంతే అని జగన్ పార్టీ నాయకులకు హుకుం జారీ చేశారుట. ఒకవేళ నర్శీపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కి బలం సరిపోకపోతే సరైన క్యాడిడేట్ ను తెలుగుదేశం నుంచి తెచ్చి మరీ గెలిపించుకోవాలని జగన్ చూస్తున్నారుట. మరి జగన్ పంతం నెరవేరుతుందా. అయ్యన్న మరో మారు మాజీ అవుతారా లేక తారాజువ్వలా లేచి అసెంబ్లీలోకి అడుగుపెడతారా అంటే వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News