'విశాఖ నగరమే పాదయాత్ర చేస్తోంది'

Update: 2018-09-09 10:01 GMT
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఇంతవరకు ఒకలా సాగితే ఇప్పుడు మరోలా సాగుతోంది. ఇప్పటికే 10 జిల్లాల్లో యాత్ర పూర్తి చేసుకుని పదకొండో జిల్లా విశాఖలో యాత్ర సాగిస్తున్న ఆయనకు ప్రతి చోటా జనం బ్రహ్మరథమే పట్టారు. అయితే... విశాఖ నగరంలో ఆయన పాదయాత్రకు మరింత ఊపొచ్చింది. విశాఖ నగరంలో జగన్ పాదయాత్రలో జనసంద్రం ఉప్పొంగుతోంది.  భిన్న రాష్ట్రాల ప్రజలకు - భిన్న సంస్కృతులకు నెలవైన విశాఖ నగరంలో ఇతర రాష్ట్రాల వారూ ఆయన వెంట సాగుతుండడం చూసి అక్కడి తెలుగుదేశం వర్గాలు షాకవుతున్నాయి. గత ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి విజయమ్మను ఓడించిన పార్టీలు, నేతలు ఈసారి మాత్రం విశాఖ నగరంలో తమ పప్పులు ఉడకవని టెన్షన్ పడుతున్నారు.
   
ప్రజా సంకల్పయాత్ర 258వ రోజులో భాగంగా - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ - నేడు విశాఖ శివార్లలోని కంచరపాలెంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆయన పాదయాత్ర - విశాఖ - పశ్చిమ పరిధిలోని గోపాలపట్నం నుంచి ఈ ఉదయం ప్రారంభం కాగా, సాయంత్రం కంచరపాలెం కూడలిలో జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
   
జగన్ కు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు - తమ సమస్యలను ఏకరవు పెడుతుంటే - త్వరలోనే అన్ని సమస్యలూ తొలగిపోతాయని, తాను అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్కరినీ ఆదుకుంటానని జగన్ హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
   
విశాఖ నగరంలో జగన్‌ కు కనిపిస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడి మంత్రి ఒకరు ఈసారి వైజాగ్ జగన్‌ దే అని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు.
   
ఇక విశాఖ తరువాత జగన్ పాదయాత్ర చేయబోయే విజయనగరం - శ్రీకాకుళం జిల్లాల టీడీపీ నేతలు కూడా ఆయన పాదయాత్ర త్వరలో తమ జిల్లాలకు రానుందని టెన్షన్ పడుతున్నారట.
Tags:    

Similar News