జ‌గ‌న్ కొత్త ప్లాన్ రిజల్ట్ ఇచ్చేలాగే ఉంది

Update: 2017-03-05 07:17 GMT
రాజ‌కీయాల్లో ల‌క్ష్యంపై స్ప‌ష్టత ఉండ‌టం ఎంత ముఖ్య‌మో దాన్ని ఛేదించేందుకు ప్ర‌ణాళిక బ‌ద్దంగా ముందుకు సాగ‌డం అంతే కీల‌కం. ఈ క్ర‌మంలో ఒంటెద్దు పోక‌డ‌ల కంటే క‌లిసిక‌ట్టుగా-ఐక‌మత్యంగా ప్ర‌త్యర్థిని దెబ్బ‌తీయ‌డం అవ‌సరం. ఇంత‌టి కీల‌క అంశాన్ని గ‌మ‌నించిన  వైఎస్ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ త‌న ప్ర‌ణాళిక‌ల‌కు మ‌రింత పదునుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లో ఆదరణను సొంతం చేసుకుంటూనే ప్రభుత్వ‌ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఇందుకోసం వామపక్ష పార్టీలతో దోస్తీకి వైఎస్ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటినుంచే చర్యలు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ లో గత ఎన్నికల్లో సర్వం కోల్పోయిన వామపక్షాలు సైతం తిరిగి పుంజుకొనేందుకు ప్రజా ఉద్యమాలు బలోపేతం చేస్తున్నాయి. దీంతో ఆ పార్టీలు సైతం వైసీపీతో జ‌ట్టుక‌ట్టేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు చెప్తున్నారు.

2004లో సుధీర్ఘ పాదయాత్ర ద్వారా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు కాంగ్రెస్‌ పార్టీకి ఆశేష ప్రజాదరణ కూడగట్టినా వామపక్షాలు సైతం తోడవ్వడంతోనే నాడు అధికారంలోనున్న టీడీపీని ఘోరంగా ఓడించగలిగాయి. దీంతో పాటు గతంలో జరిగిన ప‌లు ఎన్నిక‌ల్లో అధికార పక్షాన్ని కూలదోయడంలో ప్రధాన పార్టీలకు వామపక్ష పార్టీలు అండగా నిలబడటంతోనే సాధ్యమైందనేది రాజకీయవర్గాల విశ్లేషణ. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికార టీడీపీని ఎదుర్కునేందుకు ఇదే ఫార్ములాను అనుస‌రించాల‌ని జ‌గ‌న్ టీం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్రజాసమస్యలపై నిరంతర పోరాటాలతో అంతే బలోపేతమవుతున్న వైఎస్ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ముందున్న సవాల్‌ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఒకటి. ఇందుకోసమే వైసీపీ ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకొంటోందన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లోనే సాగుతోంది. రాష్ట్రంలో వామపక్షాలు స్వతహాగా అధికారంలోకి గానీ బలమైన ప్రతిపక్షంగా ఎదిగే పరిస్థితులు ఇప్పటికిప్పుడు లేకపోయినా అధికార పక్షానికి ప్రజా వ్యతిరేకతను బలంగా కూడగట్టడంలో మాత్రం ఆ పార్టీలు సఫలీకృతమవుతాయన్న భావన రాజకీయ వర్గాల్లో వుంది. ఈ నేపథ్యంలోనే వామపక్షాలతో దోస్తీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం. త్వరలో ఏపీలో జరిగే పెండింగ్‌ మున్సిపల్‌ - కార్పోరేషన్‌ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో స్థానికంగా అవగాహనతో వెళ్లాల‌ని పార్టీ నేతలకు వై.ఎస్‌.జగన్‌ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ వామపక్ష పార్టీల తో పొత్తు ఉండొచ్చని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అంటున్నారు. ఈ విషయంలో సీపీఎం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలసిపోయే విషయంలో ఇంకా సమయమున్నందున ప్రస్తుతం ఆ చర్చ సాగలేదని తెలుస్తోంది. అయితే త్వరలో రాష్ట్రంలోని పెండింగ్‌ కార్పోరేషన్‌ - మున్సిపల్‌ ఎన్నికల్లో మాత్రం సీపీఎంతో వైసీపీ జత కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.  సీపీఐ మాత్రం జనసేన పార్టీవైపు చూస్తుండటంతో ఆ పార్టీతో చర్చలకు ఇంకా వైసీపీ ప్రయత్నాలు ప్రారంభిలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే వామపక్ష పార్టీలు - వైసీపీ స్నేహం గ‌త కొద్ది నెలల నుంచి కొనసాగుతూనే ఉంది. గత ఏడాది అక్టోబర్‌ లో బీమవరంలో మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ సందర్శించేందుకు వెళ్లిన సిపిఎం రాష్ట కార్యదర్శి పి.మధును అడ్డుకొని పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనకు ఫోన్‌ చేసి వై.ఎస్‌.జగన్‌ మాటామంతి కలిపారు. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని తెలిపినట్లు సమాచారం. స్వయంగా వై.ఎస్‌.జగన్ సీపీఎం రాష్ట కార్యదర్శి ఫోన్‌ చేయడం వెనక ఉన్న ప్రధాన కారణం ఆ పార్టీలతో దోస్తీకి ముందస్తు చొరవేనా అన్న చర్చ నాడు రాజకీయవర్గాల్లో సాగింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News