బాబు చేయ‌లేనిది ఎలా సాధించాలో అధికారుల‌కు చెప్పిన జ‌గ‌న్‌

Update: 2019-12-18 13:25 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. విభ‌జ‌న చ‌ట్టం - రాష్ట్రానికి ద‌క్కాల్సిన ప్ర‌యోజ‌నాల విష‌యంలో మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సాధించ‌లేని దాన్ని త‌న హ‌యాంలో రాష్ట్రం కోసం సాధించి చూపేందుకు జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మచిలీపట్నం పోర్టుకు - రామాయపట్నం పోర్టు విష‌యంలో జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోర్టును నిర్మించి ఇస్తానని కేంద్రం హామీ ఇచ్చింద‌ని గుర్తు చేసిన సీఎం జ‌గ‌న్‌ ఆ మేరకు నిధులను కేంద్రం నుంచి తెచ్చుకునేలా చర్యలు చేపట్టాలని అధికారుల‌ను ఆదేశించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పోర్టులు - కొత్త పోర్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. రామాయపట్నం - మచిలీపట్నం - దుగ్గజరాజపట్నం - నక్కపల్లి - కళింగపట్నం - భావనపాడు పోర్టుల నిర్మాణంపై ప్రణాళికల తయారు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. మొదటి దఫాలో భావనపాడు - మచిలీపట్నం - రామాయపట్నం పోర్టుల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని - మచిలీపట్నం పోర్టును వీలైనంత వేగంగా కట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వచ్చే జూన్‌ నాటికి మచిలీపట్నం పోర్టుకు - రామాయపట్నం పోర్టుకు ఫైనాన్షియల్‌ క్లోజర్‌ ప్రక్రియలను పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. వచ్చే మే-జూన్‌ నాటికి ఈ రెండు పోర్టులకూ శంకుస్థాపన చేసేందుకు కావాల్సిన ప్ర‌క్రియ‌లు పూర్తి చేయాల‌ని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

దీంతోపాటుగా - త‌న ప్ర‌భుత్వం ప్రాధామ్యాలు - ఇత‌ర అంశాల గురించి సీఎం జ‌గ‌న్ అధికారుల‌కు స్ప‌ష్టంగా తెలియ‌జేశారు. నవరత్నాలు కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని - పేదలు - మధ్యతరగతి ప్రజల జీవితాలకు భరోసా లభిస్తుందని చెప్పారు. `నా తొలి ప్రాధాన్యత నవరత్నాలు - నాడు-నేడు కార్యక్రమం. ఎవరైనా మీ ప్రాధాన్యతలు ఏంటని అడిగితే ఇదే మాట చెప్తాను. ప్రతి ఏటా ఆరు లక్షల ఇళ్లు నిర్మించడం రెండో ప్రాధాన్యత అంశం. రాయలసీమ ప్రాజెక్టులకు జలాలు వెళ్తున్న కాల్వల విస్తరణ చేపట్టడం మూడో ప్రాధాన్యత అంశం’ అని సీఎం తెలిపారు. అత్యధిక ప్రజలు ఆధారపడ్డ వ్యవసారంగంలో స్థిరత్వం ఉండేలా, కరవు ప్రాంతాలకు ఊరట లభించేందుకు...పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టడం - పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌ అక్కడ నుంచి బనకచర్లకు గోదావరి జలాలు తరలించడం - ప్రతి జిల్లాకు తాగునీటిని అందించాలన్న వాటర్‌ గ్రిడ్‌ చేపట్టడం త‌న ప్రాధాన్య అంశాల‌ని వివ‌రించారు. సుమారు రూ. 35-37వేల కోట్ల ఖర్చుతో 12వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.
Tags:    

Similar News