నవ రత్నాలకు తొలి షాక్ ...?

Update: 2021-10-13 07:53 GMT
నవ రత్నాల మీద విపక్షాలు రెండేళ్ళుగా నానాయాగీ చేస్తున్న సంగతి తెలిసిందే. బయటకు ఈ పధకాల మీద నేరుగా ఆరోపణలు చేయకున్నా ఏదో పేరిట వాటిని విమర్శించడం మాత్రం మానడంలేదు. తాజాగా టీడీపీ అయితే నవరంధ్రాలు అంటూ హాట్ కామెంట్స్ చేసింది. జనసేన కూడా నవరత్నాల మీద తన కామెంట్స్ ని చేస్తూనే ఉంది. అప్పులు తెచ్చి పధకాలు ఏంటని ఇంకో వైపు బీజేపీ లాంటి పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో సంక్షేమ రధానికి ఇపుడు అన్ని విధాలుగా బ్రేకులు పడే పరిస్థితి కనిపిస్తోంది. అందరూ అనుకున్నట్లే ఈ పధకాలు అయిదేళ్ళూ సాగడం అనుమానమే అన్న మాట కూడా ఉంది.

నవరత్నాలకు జగన్ సర్కార్ తొలి షాక్ ఇచ్చింది. అది కూడా జగన్ కి ఎంతో ఇష్టమైన ఒక విధంగా ఆయన మానస పుత్రికగా చెప్పుకునే అమ్మ ఒడి పధకానికే ఇపుడు ఎసరు రాబోతోంది. రెండేళ్ల పాటు ఎలాంటి విఘ్నాలు లేకుండా అమలు చేసిన అమ్మ ఒడి పధకం మీద ఇపుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పధకాన్ని అమలు చేయడం అంటే ఏటా వేల కోట్లతో కూడుకున్న ఖర్చు. అందుకే ముచ్చటగా మూడవ ఏడాది రాకుండానే చేదు లాంటి వార్తను ప్రభుత్వం వినిపీంచింది. అదేంటి అంటే ఎవరికైతే మొత్తం స్కూల్ పని దినాలలో 75 శాతం హాజరు ఉంటుందో వారికే అమ్మ ఒడిని అమలు చేస్తామని కఠినమైన కండిషన్ జగన్ సర్కార్ తెచ్చింది. అంటే ఈ నిబంధనను పాటించని చాలా మంది విద్యార్ధులకు అమ్మ ఒడికి దూరం అయ్యే ప్రమాదం ఉంది.

అంతే కాకుండా ఇపుడు మరో బ్యాడ్ న్యూస్ ని కూడా ప్రభుత్వం వెల్లడించింది. గత రెండేళ్ళుగా అమ్మ ఒడిని సంక్రాంతి పండుగ వేళ అందిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం అలా కాకుండా 2022 విద్యా సంవత్సరం మొదట్లో అంటే జూన్ లోనే ఈ పధకం తాలూకా డబ్బులు ఇస్తారన్న మాట. అంటే అదిపుడు అమ్మ ఒడి లబ్దిదారుల నెత్తిన గుది బండ లాంటిదే అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు వేస్తే తమ పిల్లల ఫీజులను కట్టుకునే వారంతా ఇపుడు షాక్ తినేశారు. అంటే వారు తమ సొంత డబ్బులతో ఫీజులు కట్టుకుంటే ప్రభుత్వం తమ నిబంధలకు అనుగుణంగా ఉన్న వారి తల్లుల ఖాతాల్లోనే అమ్మ ఒడి నిధులు వేస్తుంది అన్న మాట.

ఒక విధంగా ఇది సర్కార్ తప్పించుకునే వైఖరి మాత్రమే అని ఇప్పటికే విపక్షాలు పాట మొదలెట్టేశాయి. ఇక ఇదే అమ్మ ఒడి పధకానికి మరిన్ని మార్పులు చేస్తారని కూడా వినిపిస్తోంది. అదేంటి అంటే ఇక మీదట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారికే ఈ పధకం వర్తింపచేస్తారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి ఏటా వేల కోట్ల నిధులతో అతి పెద్ద భారంగా మారిన సర్కార్ వారి ఈ పధకానికి ఇపుడు మబ్బులు కమ్మినట్లే అంటున్నారు. ఇదే తీరులో మరిన్ని పధకాల విషయంలో నిబంధనల కొరడాను ఝలిపించాలనుకుంటున్నారుట. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగులేకపోవడం వల్లనే ప్రభుత్వం ఇలాంటి కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది అంటున్నారు. మొత్తానికి చూస్తే పరిస్థితులు కారణాలు ఏవైనా వైసీపీ సర్కార్ కి ఇది రాజకీయంగా కొంత ఇబ్బంది పెట్టేదే అంటున్నారు.




Tags:    

Similar News