మంత్రుల‌కు ల‌క్ష్మ‌ణ‌రేఖ గీసిన జ‌గ‌న్‌!

Update: 2019-06-20 04:30 GMT
అంద‌రి ల‌క్ష్యం ఒకేలా ఉండాలి. ఒక‌రి దారి ఒక్కొక్క‌టిగా ఉంటే గ‌మ్యానికి చేరుకోవ‌టం క‌ష్ట‌మ‌వుతుంది. అంతా ఒకే మాట ఉంటే ఆ తీరు వేరుగా ఉంటుంది. ఇదే విష‌యాన్ని త‌న‌దైన శైలిలో మంత్రుల‌కు స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి. ఈ నెల ప‌దిన మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని నిర్వ‌హించిన జ‌గ‌న్‌.. తాజాగా మంత్రుల‌కు ఒక కీల‌క నోట్ పంపారు.

తొలి కేబినెట్ స‌మావేశంలోనే త‌న ప్ర‌భుత్వ ప్ర‌యారిటీల‌కు సంబంధించి స్ప‌ష్ట‌త ఇచ్చిన ఆయ‌న‌.. తాజాగా త‌న మంత్రుల‌కు ల‌క్ష్మ‌ణ‌రేఖ గీస్తూ లేఖ రాశారు. ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త మొత్తం ఎన్నిక‌లకు ముందు నుంచి హామీ ఇస్తున్న న‌వ‌ర‌త్నాల హామీ అమ‌లేన‌ని.. చివ‌రి ల‌బ్థిదారు వ‌ర‌కూ హామీల ఫ‌లాలు అందాల‌న్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా యువ సీఎం స్ప‌ష్టం చేశారు.

విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు ఏమీ త‌న‌కు చెప్ప‌కుండా ప్ర‌క‌టించొద్ద‌ని.. ప్ర‌భుత్వ ప‌రంగా లాభ‌న‌ష్టాల‌ను అంచ‌నా వేయ‌కుండా.. వాటిపై అధ్య‌య‌నం చేయ‌కుండా ప్ర‌క‌ట‌న‌లు చేయొద్ద‌ని తేల్చి చెప్పారు. త‌న దృష్టికి రాకుండా విష‌యాల్ని మంత్రులు ప్ర‌క‌ట‌న‌లు చేస్తే ఇబ్బందుల‌కు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. 

తాను కోరుకున్న ల‌క్ష్యం దిశ‌గా ప్ర‌భుత్వం సాగాల‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ తాజా లేఖ‌లో మంత్రుల‌కు స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి. కేబినెట్ భేటీ జ‌రిగి ప‌ది రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ త‌ర‌హా లేఖ రాయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వారిలో ఎక్కువ‌మంది సీనియ‌ర్లు కాక‌పోవ‌టంతో తొంద‌ర‌ప‌డ‌తార‌న్న ఆలోచ‌న‌తో ముంద‌స్తు జాగ్ర‌త్త కోసం తాజా లేఖ రాసి ఉంటార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News