తన గురించి చెప్పడు కానీ బాబుని ప్రశ్నిస్తాడే?

Update: 2015-03-20 12:30 GMT
ఏపీ విపక్ష నేత జగన్‌ వ్యవహారశైలి కాస్త భిన్నమన్న విషయం ఏపీలో రాజకీయాల గురించి తెలిసిన ప్రతిఒక్కరికి తెలిసిందే.ఆయన అమితంగా వ్యతిరేకించే వారిలో చంద్రబాబు ముందుంటారు. ఇక.. ఆయనకు ఉన్న మరో అద్భుతమైన కళ ఏమిటంటే.. తన తప్పుల్ని ప్రశ్నించిన వారికి సూటిగా సమాధానం చెప్పకుండానే బాబును టార్గెట్‌ చేసేస్తుంటారు.

తాజాగా ఆయన కాస్తంత ఎటకారంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇంగ్లిషు వచ్చా అని ప్రశ్నించి.. దానికి సమాధానం తానే చెప్పేస్తూ.. బాగానే వచ్చన్నారు. ఇంతకీ ఆయన.. బాబు..ఇంగ్లిషు వ్యవహారం ఎందుకు ప్రస్తావించారంటే.. ఇంగ్లిషు బాగా వచ్చిన చంద్రబాబు.. జాతీయ మీడియాతో ఎందుకు మాట్లాడరంటూ ప్రశ్నించారు.

విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ తెలుగు మీడియాకు బోర్‌ కొట్టించే వరకూ మాట్లాడే బాబు.. ఇంగ్లిషు మీడియాతో ఎందుకు మాట్లాడరన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. తెలుగులో ఎంత మాట్లాడినా మోడీకి అర్థం కాదని.. అదే జాతీయ మీడియాలో మాట్లాడితే బాబుమాటలు మోడీకి అర్థం అవుతాయన్న ఉద్దేశ్యంతో మాట్లాడరంటూ సరికొత్తగా ఆరోపణలు చేశారు.

జగన్‌ అమాయకత్వం కాకపోతే.. తెలుగు మీడియాతో మాట్లాడే మాటలు ఇంగ్లిషు పేపర్లలో రావా? వాటిని మోడీ వద్దకు తీసుకెళ్లేవారు తీసుకెళ్లకుండా ఉంటారా?

ఇలా తన మాటలతో బాబు మీద సరికొత్త సందేహాలు తీసుకొచ్చేలా మాట్లాడే జగన్‌.. తాను విభజన హామీలపై ఎందుకు మాట్లాడటం లేదన్న దానికి తనదైన శైలిలో బదులిస్తున్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నామని.. అప్పటికి ప్రధాని వద్దకు వెళ్లి విన్నవించామని చెప్పారు.

మరి..జగన్‌ వాదనే నిజమైతే.. ఏపీ అసెంబ్లీలో ఒక్క స్థానం కూడా లేని కాంగ్రెస్‌ నేతలు మరి ఇలానే ఢిల్లీకి వెళ్లి ఒక వినతిపత్రం ఇచ్చి ఇంట్లో కూర్చోవచ్చుగా? రోడ్ల మీదకు వచ్చి మరీ ఆందోళనలు ఎందుకు చేస్తున్నట్లో..? వినేవారుంటే చెప్పేవారు చెలరేగిపోతారనే మాటకు జగన్‌ నిలువెత్తు రూపంగా కనిపిస్తారు. కాదంటారా?

Tags:    

Similar News