కేసీఆర్ చేయ‌ని ప‌నిని చేసిన జ‌గ‌న్‌!

Update: 2019-05-29 05:41 GMT
మ‌నం ఏ స్థానంలో అయినా ఉండొచ్చు. కానీ.. ఒద్దిక చాలా అవ‌స‌రం. ఆ విష‌యాన్ని ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాగానే అర్థం చేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. గ‌తంలో మాదిరి కాకుండా.. ఆయ‌న చాలా విష‌యాల్లో సెటిల్డ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తాజాగా తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నంలోనూ అదే తీరును ప్ర‌ద‌ర్శించారు జ‌గ‌న్‌.

ఏదైనా ప‌ని స్టార్ట్ చేసే ముందు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకొని.. ఆయ‌న ఆశీర్వాదం తీసుకుంటే మంచి జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం చాలామందికి ఉంటుంది. దీనికి త‌గ్గ‌ట్లే జ‌గ‌న్ ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. కాబోయే ముఖ్య‌మంత్రి హోదాలో ఆల‌యం ముందు నుంచి నేరుగా ఆల‌యంలోకి వెళ్లే అవ‌కాశం ఉన్నా.. జ‌గ‌న్ మాత్రం అలాంటి పొర‌పాటు చేయ‌లేదు.

ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ఆయ‌న కుటుంబ స‌భ్యులంతా తిరుమ‌ల‌కు రావటం.. స్వామివారిని ద‌ర్శించుకునేందుకు ఆల‌యం ముందు నుంచి నేరుగా లోప‌ల‌కు వెళ్ల‌టాన్ని కొంద‌రు త‌ప్పు ప‌ట్టారు. ప‌వ‌ర్ ఉంది క‌దా అని.. స్వామి వారి ముందు అలా చేయ‌టం స‌రికాద‌న్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ కు అవ‌కాశం ఉంటుంది కానీ.. ఆయ‌న ఫ్యామిలీ మొత్తానికి అలాంటి అవ‌కాశం ఉండ‌దు.

తాజాగా జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న  స్వామి ద‌ర్శ‌నం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మార్గంలో వెళ్లి స్వామి వారిని ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఆల‌యంలో స్వామి వారి సేవ‌లో గ‌డిపిన జ‌గ‌న్ కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద పండితులు ఆశీర్వ‌చ‌నం ప‌లికారు. శ్రీ‌వారిని ద‌ర్శ‌నం చేసుకునే స‌మ‌యంలో జ‌గ‌న్ వెంట విజ‌య‌సాయిరెడ్డి.. భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. ఆర్కే రోజా.. చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి.. వేమిరెడ్డి ప్రభాక‌ర్ రెడ్డి.. త‌దిత‌ర నేత‌లు.. పార్టీ ఎమ్మెల్యేలు ప‌లువురు ఉన్నారు. నిబంధ‌న‌ల్ని తూచా త‌ప్ప‌కుండా స్వామి వారి ద‌ర్శ‌నం చేసుకోవ‌టం ద్వారా జ‌గ‌న్ ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News