మరో చాన్స్ కావాలంటున్న జగన్

Update: 2022-12-21 02:30 GMT
వైఎస్ జగన్ మరో చాన్స్ అడిగారు. ఇది ఆశ్చర్యం ఏమాత్రం కాదు. ఎందుకంటే జగన్ మూడు దశాబ్దాల పాటు సీఎం కుర్చీలో కూర్చోవాలని  టార్గెట్ పెట్టుకున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో ఒక్క చాన్స్ అడిగారు కదా అది ఇచ్చేశారు చాలు అని టీడీపీ అధినేత చంద్రబాబు లాంటి వారు అనుకుంటే అది వారి రాజకీయం మాత్రమే అనుకోవాలి. జగన్ ఒక్క చాన్స్ ఇవ్వండి అన్నారు తప్ప అదొక్కటే చాలు అని ఎక్కడా అనలేదు.

ఆయన తన పాదయాత్ర సందర్భంగా కూడా తాను అధికారంలోకి వస్తే ముప్పయ్యేళ్ళ పాటు పాలిస్తాను అని ఎలాంటి మొహమాటం దాపరికం లేకుండా చెప్పిన సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అందువల్ల 2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు అవుతాయే ఏమో తెలియదు కానీ జగన్ కి మాత్రం అవి రెండవ మెట్టుగానే చూడాలని అంటున్నారు.

ఇదిలా ఉండగా జగన్ ఈ మధ్య జిల్లా టూర్లలో కూడా తాను మంచి చేశాను అని అనుకుంటున్నాను అని తన పాలన మెచ్చుకుంటే మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను గట్టిగానే కోరుతున్నారు. అంటే జగన్ కి రెండవసారి అధికారంలోకి రావాలని గాఢంగా ఉంది. అంతే కాదు వై నాట్ 175 అని కూడా అంటున్నారు. అంటే ఏపీలో విపక్షం లేని రాజకీయం చేయాలని, అలా మూడు దశాబ్దాల పాలన పూర్తి చేయాలని జగన్ కంకణమే కట్టుకున్నారు.

ఇక ప్రజలను జగన్ అడుగుతూ వచ్చారు కదా ఇపుడు తాను గట్టిగా నమ్మే ఏసు ప్రభువుని కూడా ఆయన అదే కోరుకున్నారు. క్రిస్మస్ వేడుకలు విజయవాడలో ఏ వన్ కన్వెన్షన్ హాల్ లో జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ అధికారం గురించే ఎక్కువగా చెప్పారు. అధికారంలో ఉన్న వారు ప్రజలకు సేవకులే తప్ప అంతకంటే ఎక్కువ అధికులం అని అనుకోవడానికి వీలు లేదని అన్నారు. అధికారంలో ఉంటే ఒదిగి ఉండాలని ఆయన ఉద్భోదించారు.

తనకు ఆ గుణం ఇంకా ఎక్కువగా ఉండేలా చూడాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్లుగా జగన్ చెప్పుకున్నారు. ఇక మన నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నారో దానిని తెల్సుకుని ఆ దిశగా పనిచేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇక ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాన్ని అదృష్టాన్ని దేవుడు తనకు ఇవ్వాలని కోరుకుంటున్నానని జగన్ అన్నారు

అంటే వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించేలా చూడమని జగన్ మొక్కుకున్నారు అన్న మాట. 2024 ఎన్నికలు వచ్చే లోగా మరో క్రిస్మస్ అయితే షెడ్యూల్ ప్రకారం వస్తుంది. కానీ జగన్ మాత్రం 2022 క్రిస్మస్ కే దేవుడిని కోరుకున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చేది తామే అని ఇప్పటికే నిబ్బరంగా చెబుతున్న జగన్ తనకు ప్రజల ఆశీస్సులు దేవుడి దీవెనలు ముఖ్యమని ఎపుడూ చెబుతూ ఉంటారు. ఆ విధంగా చూస్తే ఆయన మరో చాన్స్ అని గట్టిగానే అడుగుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా జగన్ సీఎం అవుతారా అన్నది చూడాలి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News