జై శ్రీ‌రాంపై 49 మంది సెల‌బ్రిటీల సంచ‌ల‌న లేఖ‌!

Update: 2019-07-25 05:06 GMT
ద‌ర్శ‌కులు అనురాగ్ క‌శ్య‌ప్.. మ‌ణిర‌త్నం.. న‌టి కొంక‌ణ సేన్ శ‌ర్మ‌.. అప‌ర్ణ సేన్.. రేవ‌తి ఇలా చెప్పుకుంటూ పోతే సినీ.. సెల‌బ్రిటీల‌కు చెందిన 49 మంది ప్ర‌ముఖులు తాజాగా ప్ర‌ధాని మోడీకి రాసిన లేఖ ఒక‌టి సంచ‌ల‌నంగా మారింది. దేశంలో జైశ్రీ‌రాం అన్న నినాదం వ‌ణికించేలా మారింద‌న్న అసంతృప్తిని..ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. దేశంలో మూక‌దాడులు పెరుగుతున్న తీరును వారు త‌ప్పు ప‌ట్టారు.

ముస్లింలు.. ద‌ళితుల‌పై మూక‌దాడుల్ని వెంట‌నే ఆపేయాల‌ని వారంతా కోరారు. దేశంలోని దీన స్థితికి తాము బాధ ప‌డుతున్న‌ట్లుగా పేర్కొన్నారు. నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక‌ను చ‌దివిన తాము షాక్ కు గురైన‌ట్లుగా లేఖ‌లో పేర్కొన్నారు. 2016 ఒక్క ఏడాదిలోనే ద‌ళితుల‌పై 840కి పైగా దాడులు జ‌రిగాయ‌ని.. కుల‌..మతాల ఆధారంగా విద్వేషాలు పెరిగిపోయిన‌ట్లుగా పేర్కొన్నారు. 2009 నుంచి 2018 అక్టోబ‌రు వ‌ర‌కు జ‌రిగిన మూక‌దాడుల్లో 91 మంది మ‌ర‌ణించగా.. 579 మంది గాయ‌ప‌డ్డార‌ని.. ఇందులో 90 శాతం కేసులు 2014 త‌ర్వాత న‌మోదైన‌వేన‌ని పేర్కొన్నారు.

అంటే.. ఈ దాడుల‌న్ని మీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాతేనంటూ మోడీ ప్ర‌భుత్వంలో పెరుగుతున్న మూక‌దాడులపై వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జైశ్రీ‌రాం అన్న నినాదం వింటేనే ప్ర‌జ‌లు వ‌ణుకుతున్నార‌ని.. ఇప్పుడ‌ది కొంద‌రు ఆక‌తాయిలు.. నేర‌స్థుల‌కు ఆయుధంగా మారింద‌ని.. దేశంలో ప్ర‌తి ఒక్క‌రూ స్వేచ్ఛ‌గా జీవించాల‌న్నారు.

రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 19 దేశంలోని ప్ర‌తి ఒక్క పౌరుని భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను తెలియ‌జేస్తుంద‌ని.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే వారిని దేశ ద్రోహులు.. ఆర్బ‌న్ న‌క్స‌లైట్ల పేరుతో హింసించ‌టం స‌బ‌బు కాద‌న్న వారు.. ప్ర‌జాస్వామ్యంలో అస‌మ్మ‌తి స‌హ‌జ‌మ‌ని.. అది లేకుండా ప్ర‌జాస్వామ్య‌మే లేద‌న్నారు.

ప్ర‌భుత్వ నిర్ణ‌యాల్ని ప్ర‌శ్నిస్తే వారు అర్బ‌న్ మావోయిస్టులా? అని ప్ర‌శ్నించిన వారు.. మూకుదాడుల్ని పార్ల‌మెంటులో ఖండిస్తే స‌రిపోద‌న్నారు. నిందితుల‌కు తీవ్ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. దేశంలో ద‌ళితులు.. మైనార్టీలు.. మ‌హిళ‌ల‌పై ఆరాచ‌కాలు పెరిగిపోయాయ‌ని.. విచార‌ణ లేకుండా శిక్షించే ఉదంతాలు కూడా పెరిగాయ‌న్నారు. మ‌రి.. దీనికి మోడీ మాష్టారి నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.


Tags:    

Similar News