ఆ ఎమ్మెల్యేను చూస్తే..జగన్ మనసు దోచుకోవటం ఎలానో తెలుస్తుంది!

Update: 2020-08-26 06:00 GMT
విధేయతను ప్రదర్శించటంలో చేతలు కీలకమైనా.. మాటలు అత్యంత అవసరం. చేతల్లో ఎంత చూపించినా.. మాటల్లో విధేయత మిస్ అయితే.. అనవసర వివాదాలు చుట్టుముట్టటం గ్యారెంటీ. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి.. తర్వాతికాలంలో ఏపీ అధికారపార్టీలో చేరిన వల్లభనేని వంశీకి జగన్ మీద ప్రేమాభిమానాలు లేవని చెప్పలేం. అదే సమయంలో.. పార్టీ విషయంలోనూ.. అధినేత విషయంలోనూ ఆయన కమిట్ మెంట్ ఎంతన్న దానిపై ఒక్కొక్కరు ఒక్కోలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటల ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి.

అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం నచ్చని రీతిలో ఆయన తీరు ఉందన్న మాటలు పలువురి నోట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. వంశీ చేస్తున్న తప్పులేమిటో అర్థమయ్యేలా మరో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అధినేత మనసును దోచుకోవటం ఎలా అన్నది కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచిన నేతను చూస్తే అర్థమవుతుందన్న మాట వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రస్తావించటం గమనార్హం.

గత ఎన్నికల్లో అనూహ్యంగా బరిలోకి దిగిన జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. తాజాగా తనపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై స్పందించారు. తాను వైఎస్ వారసుడ్ని అని.. పార్టీ నుంచి బయటకు వెళ్లే ఆలోచన అస్సలు లేదని తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తేనే నిలబడతాను. ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు చేస్తాను. వైఎస్ కుటుంబాన్ని ఎదిరించిన వాళ్లు ఎవరూ బాగుపడలేదు. నేను గెలిచానంటే దానికి కారణం కడప ఎంపీ అవినాష్ రెడ్డి. అలాంటి కుటుంబాన్ని ఎందుకు తిడతాను చెప్పండి’’ అంటూ తన వ్యాఖ్యలతో పార్టీపైనా.. అధినేతపైనా తనకున్న కమిట్ మెంట్ ను చెప్పేస్తారు.

2019 ఎన్నికల్లో అనూహ్యంగా తెర మీదకు వచ్చిన  ఆయన.. టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై ఏకంగా 51వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించటం తెలిసిందే. ఎన్నిల్లో ఓడిన తర్వాత రామసుబ్బారెడ్డి పార్టీలోకి చేరిన వైనం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం లభిస్తుందా? లేదా? అన్న అనవసర ఆందోళనను వదిలి.. తన రాజకీయ జీవితాన్ని జగన్ చేతుల్లో ఉంచేసినట్లుగా పేర్కొన్న ఆయన మాటల్ని చూసైనా.. వల్లభనేని వంశీ లాంటోళ్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

పార్టీలోకి చేరిన తర్వాత.. అధినేతకు అత్యంత విధేయుడ్ని అన్న మాటలు.. జగన్ మనసును దోచుకుంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు. ఉప ఎన్నికల్లో పోటీపై తరచూ వంశీ చేస్తున్న వ్యాఖ్యలు.. జగన్ కు చిరాకు తెప్పిస్తాయన్న విషయాన్ని వల్లభనేని వారు ఎందుకు మర్చిపోతున్నారో అన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.
Tags:    

Similar News