జానాసాబ్ ఇంత యాక్టివ్‌ గానా?

Update: 2015-07-17 10:31 GMT
ఆందోళ‌న‌లు.. ధ‌ర్నాలు లాంటి ప‌నుల‌కు దూరంగా ఉంటూ.. మ‌హా అయితే నాలుగు మాట‌లు మాట్లాడ‌టం.. అది కూడా సుతిమెత్త‌గానే త‌ప్పించి.. ప్ర‌భుత్వంపై పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేయ‌క‌పోవ‌టం తెలంగాణ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత జానారెడ్డికి అల‌వాటే. అలాంటి ఆయ‌న తాజాగా పారిశుద్ద్య కార్మికులు చేస్తున్న స‌మ్మెకు మ‌ద్ధుతుగా రోడ్డు మీద‌కు వ‌చ్చారు.

ఇలా రోడ్డు మీద‌కు వ‌చ్చింది ఒక్క జానారెడ్డి మాత్ర‌మే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. మండ‌లి విప‌క్ష నేత ష‌బ్బీర్ అలీ.. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల ల‌క్ష్మ‌య్య‌.. శ్రీధ‌ర‌బాబు.. వీహెచ్‌.. దానం నాగేంద‌ర్ లాంటి నేత‌లు చాలామంది వ‌చ్చేశారు.

గ‌త ప‌ద‌కొండు రోజులుగా స‌మ్మె చేస్తున్న కార్మికుల‌కు మ‌ద్ధ‌తుగా వారు రోడ్డు మీద‌కు రావ‌ట‌మేకాదు.. ఊహించ‌ని విధంగా అసెంబ్లీ ముట్ట‌డికి బ‌య‌లుదేరారు. సాధార‌ణంగా ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండే జానారెడ్డి మ‌హా హుషారుగా పాల్గొన‌టం విశేషం.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. ప్ర‌భుత్వానికి కొన్ని హెచ్చ‌రిక‌లు చేసిన‌ట్లుగా మాట్లాడారు. జీతాల పెంపు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన ఆయ‌న‌.. కార్మికుల‌పై పెట్టిన కండీష‌న్ల‌పై మాత్రం అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

పెద్ద‌రికంగా ఉంటూ.. హుందాగా రాజ‌కీయాలు చేయాల‌ని మాట‌లు చెప్పే జానారెడ్డి.. రోడ్డు మీద‌కు రావ‌టం తెలంగాణ కాంగ్రెస్‌కు మంచి శ‌కునంగా చెబుతున్నారు. యువ‌రాజు రాహుల్‌ పీకిన క్లాసు పుణ్య‌మో.. లేదంటే.. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవాల‌నుకుంటున్నారా? అన్న సూటి ప్ర‌శ్నోకానీ.. జానారెడ్డి మీద తీవ్ర‌ప్ర‌భావాన్ని చూపించిన‌ట్లుంది.
Tags:    

Similar News