జానారెడ్డిని కిడ్నాప్ చేశారు!

Update: 2016-07-30 06:59 GMT
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మిగిలిన రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరించే ఆయనకు తెలంగాణ పోలీసుల తీరు షాకింగ్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర సర్కారు చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై పలు గ్రామాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ.. ఆయా గ్రామాల్లో పర్యటించేందుకు ఆయన బయలుదేరారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే మీద ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఉదయం 11 గంటల సమయంలో జానాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత నుంచి తమదైన శైలిలో వ్యవహరించటం ఆసక్తికరంగా మారింది. ఎక్కడికి తీసుకెళుతున్నది.. ఏ స్టేషన్ కు తరలిస్తున్న విషయాల్ని జానా అండ్ కోకు చెప్పని పోలీసులు అదే పనిగా జీపులో తిప్పటం గందరగోళంగా మారింది. తమకు ఎక్కడకు తీసుకెళుతున్నారో అడిగినా పోలీసులు చెప్పటం లేదని.. ఇలా తిప్పటం ఏమిటంటూ వారుఫైర్ అయ్యారు. అయినప్పటికీ పోలీసులు స్పందించకుండా.. వారి పని వారిదన్నట్లుగా వ్యవహరించారు.

చివరకు ఐడీఏ బొల్లారం స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు.. జానా అండ్ కోను స్టేషన్లోనే ఉంచేవారు. వాస్తవానికి ప్రముఖ నేతల్ని పోలీసులు ఏదైనా కారణం చేత అదుపులోకి తీసుకుంటే.. వేరే స్టేషన్ వరకూ తీసుకెళ్లి తర్వాత వదిలేయటం చేస్తుంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలు హరీశ్.. ఈటెల రాజేందర్ లాంటి వారికి ఇలాంటి అనుభవం తరచూ ఎదురయ్యేది. అయితే.. ఎవరిని గంటల కొద్దీ పోలీస్ స్టేషన్లో ఉంచేవారు కాదు. అందుకు భిన్నంగా జానా అండ్ కోను సాయంత్రం నాలుగు గంటల వరకూ స్టేషన్లో ఉంచేసిన పోలీసులు.. ఆ తర్వాత రామచంద్రాపురం సీఐ స్టేషన్ కు వెళ్లి జానా ను వెళ్లిపోవచ్చంటూ చెప్పటంపై ఆయన తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు తాను చేసిన తప్పేంటి? తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఏ నేరం మీద తనను స్టేషన్ కు తరలించారు? లాంటి ప్రశ్నల్నిపోలీసులకు వేసిన జానా.. తనను పోలీసులు కిడ్నాప్ చేసిన తరహాలో తీసుకొచ్చారన్నారు. తెలంగాణలో సీనియర్ రాజకీయ నేతగా.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని చెప్పుకునే జానారెడ్డిని కారణం చెప్పకుండానే గంటల తరబడి స్టేషన్లో ఉంచేయటం దారుణమనే చెప్పాలి.
Tags:    

Similar News