పవన్ ఏం చేసినా తప్పే.. కొత్త ట్రెండ్ కు తెర తీస్తున్న అద్దె మైకులు

Update: 2022-11-07 12:30 GMT
అద్దె మైకుల హడావుడి ఈ మధ్యన ఎక్కువైంది. రాజకీయ విశ్లేషణ పేరుతో తాసు పట్టుకున్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. అంతే తప్పించి.. బుర్రలోని ప్లాన్ ను అమలు చేసేందుకు అక్షరాలను వాడేసే తీరు ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది రాజకీయ నేతలు ఉన్నా.. ఉపదేశాలు.. హితోక్తులు అన్ని పవన్ కు మాత్రమే ఉండాలన్నట్లుగా ఉంది. మిగిలిన వారు ఎలా మాట్లాడినా.. ఏం చేసినా మాత్రం నోరు విప్పరు. తెలుగు రాష్ట్రాల్లో బూతుల పంచాంగాన్ని విప్పింది ఎవరు? అసహ్యకరమైన రీతిలో మాట్లాడితే నోరు విప్పి మాట్లాడటానికి.. తప్పురా బాబు..మీరు చేసేదన్న మాట చెప్పటానికి ధైర్యం లేనోళ్లు.. పవన్ కు హితోక్తులు చెప్పటానికి మాత్రం చెలరేగిపోతారు.

ఎందుకంటే.. తనను తప్పు పట్టే వారిని పవన్ ఏమీ అనరు. అదే.. ఆయన ప్రత్యర్థులైతే.. మరింత లోతుగా టార్గెట్ చేయటమే కాదు.. వ్యక్తిగతంగా దెబ్బ తీయటానికి ప్లాన్లు వేస్తుంటారు. వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో అస్సలు పనికి రావు. అందులోకి ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికి ఉండదు.

కానీ.. ఈ విషయంలో పవన్ ను మాత్రం మినహాయించేస్తుంటాయి అద్దె మైకులు. మూడు పెళ్లిళ్లు అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడే నేతల మాటల్లో వెకిలితనం మేధావి విశ్లేషకులకు పట్టదు. తమ ఇంట్లో విషయాల్నివదిలేసి.. గురివింద చందాన పవన్ ను టార్గెట్ చేసే వారి తీరు చూస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది.

నోరు తెరిచి.. స్పష్టంగా.. సూటిగా మాట్లాడటం కుదరని తమ అభిమాన నేతలో లోపాలుకనిపించవు కానీ.. భావోద్వేగంతో మాట్లాడే పవన్ లో మాత్రం ఆవేశపరుడు.. దూకుడు తత్త్వం నిండిన తెలివిలేనోడు కనిపిస్తూ ఉంటాడు. విపక్ష నేతగా వైఎస్ జగన్ వ్యవహరించినప్పుడు.. నెలల తరబడి ఆయన ప్రజల్లో ఉండేవారు కాదు. ఆ మాటకు వస్తే ఎవరికి అందుబాటులో ఉండేవారు కాదు. అలాంటప్పుడు కనిపించని లోపాలు.. తనకు అవసరమైన ఆర్థిక బలం కోసం సినిమాలు చేస్తానని నిజాన్నినిజాయితీగా ఒప్పుకున్న పవన్ లో మాత్రమే తప్పులు కనిపిస్తాయి. లోపాలు దర్శనమిస్తాయి.. వీకెండ్ రాజకీయ నేతగా విశ్లేషిస్తుంటారు.

సీరియస్ రాజకీయ నాయుకుడిలా పవన్ పరిణితితో వ్యవహరించలేదని నోటికి వచ్చినట్లుగా అడ్డమైన చెత్తను పొందిగ్గా అక్షరాల్లో నింపేసే పచ్చకామెర్ల అద్దెమైకులకు.. మరి తాము వకల్తా పుచ్చుకున్న జగన్ పరిణితి కలిగిన మహానేతగా ఎందుకు కనిపిస్తారు? ఆయన మూడున్నరేళ్ల పాలనలో పట్టుమని పదిరోజులైనా ఏపీ ప్రశాంతంగా ఉందా? మరే ముఖ్యమంత్రి పాలించిన కాలంలోనూ జరగనన్ని విపక్ష నేతల అరెస్టులు.. కేసులు ఏం చెబుతున్నాయి? అదేనా పరిణితి? అదేనా పవన్ లో ఉండాలని కోరుకుంటున్నది?

ఇవాల్టి రోజున ఏపీ ఎదుర్కొనే ప్రతి సమస్య గురించి లోతుగా విశ్లేషించి.. వాటికున్న పరిష్కార మార్గాల గురించి చెప్పే శక్తి ఉన్న అతి  కొద్ది మంది నేతల్లో పవన్ ఒకరు. కానీ.. ఆ కోణం అద్దె మైకులకు అస్సలు కనిపించదు. ఒకవేళ.. కనిపించినా కన్వీనియంట్ గా మర్చిపోయే ప్రయత్నం చేస్తుంటారు. తాను ఎప్పుడైనా.. ఎక్కడైనా తప్పు చేసినా.. తప్పుగా మాట్లాడినా.. గుర్తు పెట్టుకొని మరీ.. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ క్షమాపణలు కోరుకునే పవన్ లో పరిణితి కనిపించదు కానీ.. రాజకీయం అంటే ప్రతీకారం తీర్చుకోవటమే.. ప్రత్యర్థిని ఏదోలా తొక్కేయటమే.. నిజాన్ని చెప్పే బదులు అబద్ధాన్ని అందమైన నిజంగా ప్రచారం చేయటమే అని నమ్మే బ్యాచ్ కు అద్దె మైకులుగా వ్యవహరించే వారికి.. పవన్ కచ్ఛితంగా పరిణితి చెందిన నాయకుడిగా కనిపించరు. ఆయనలో కేవలం దూకుడు.. .ఆవేశం మాత్రమే కనిపిస్తుంది. అంతకు మించి అద్దె మైకుల నుంచి ఇంకేం ఆశిస్తాం చెప్పండి?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News