జనసేనలో రిపబ్లిక్‌ డే కి కీలక పరిణామాలు!

Update: 2023-01-25 17:00 GMT
జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ దూకుడు పెంచారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ లో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర, జనవాణి కార్యక్రమాలను ఆయా జిల్లాల్లో పవన్‌ నిర్వహించారు. ఇక ఇప్పుడు బస్సు యాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేయించిన వారాహి వాహనానికి తెలంగాణలో సుప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టులో పూజలు చేయించారు. పొత్తులపైన, తెలంగాణలో పోటీ పైన కూడా పవన్‌ సంచలన ప్రకటన చేశారు.

తెలంగాణలో కొన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇక్కడ కూడా ఎవరైనా పొత్తులకు వస్తే బాగుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనన్నారు. ఏపీలో తమకు బీజేపీతో పొత్తు ఉందని.. ఆ పార్టీ తమతో కలసి రాకపోతే ఒంటరిగా ముందుకు సాగుతామని తేల్చిచెప్పారు.

మరోవైపు కొండగట్టులో పూజలు ముగించుకున్నాక పవన్‌ గోదావరి తీరాన ఉన్న ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వెళ్లారు. అక్కడ నుంచి జనవరి 25 నేరుగా విజయవాడలో దుర్గమ్మను సందర్శించుకుంటారు. వారాహి వాహనానికి విజయవాడలో కూడా పూజలు జరిపిస్తారు.

జనవరి బ25, 26 రెండు రోజులు పవన్‌ కల్యాణ్‌ విజయవాడలోనే ఉంటారని చెబుతున్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరతారని పేర్కొంటున్నారు. ఇప్పటికే తమ పార్టీ నేతలను చేర్చుకోవడానికి వైసీపీ, టీడీపీ కుట్రలు చేస్తున్నాయని తాజాగా బీజేపీ నేతలు జీవీఎల్‌ నర్సింహారావు, సోము వీర్రాజు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరితే బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సింది. మరోవైపు కన్నా లక్ష్మీనారాయణతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన ఆయన అనుచరులు సైతం కన్నాతోపాటే జనసేనలో చేరతారని తెలుస్తోంది.

ఇప్పటికే కన్నాపై పవన్‌ కళ్యాణ్‌ సైతం సానుకూలంగా స్పందించారు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన బాగుండాలని తాను కోరుకుంటానన్నారు. అలాగే కన్నా లక్ష్మీనారాయణతోపాటు మరికొందరు వేరే పార్టీల నేతలు కూడా జనసేన తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.

అలాగే జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ  సందర్భంగా వివిధ సంఘాల నేతలు, పార్టీల నేతలు జనసేనలో చేరతారని అంటున్నారు.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News