జాతీయ రాజకీయాల మీద రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మంచి మాటకారి. సందర్భానుసారం ఎక్కడ ఏది మాట్లాడాలో బాగా తెలిసిన వారు.

Update: 2025-01-06 04:24 GMT

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మంచి మాటకారి. సందర్భానుసారం ఎక్కడ ఏది మాట్లాడాలో బాగా తెలిసిన వారు. తాజాగా ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావన తెచ్చారు. అది కూడా సందర్భోచితంగానే. తెలుగు వారు ఎక్కడైనా గొప్పగా నిలబడాలి అని చెబుతూనే రేవంత్ రెడ్డి అన్న మాటలు ఆసక్తిని పెంచాయి.

తెలుగు వారు జాతీయ రాజకీయాలను శాసించాలని ఆయన అన్నారు. గతంలో పీవీ నరసింహారావు ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు వంటి వారు జాతీయ రాజకీయాల్లో తీవ్రమైన ప్రభావం చూపించారని ఆయన గుర్తు చేశారు. వర్తమాన కాలంలో మాత్రం ఆ పరిస్థితి లేదని అన్నారు.

ఇక గతంలో జాతీయ రాజకీయాలు అంటే అనేక మంది పేర్లు వినిపించేవని రేవంత్ రెడ్డి చెప్పారు. నీలం సంజీవరెడ్డి, కాకా వెంకటస్వామి, జైపాల్ రెడ్డి, వంటి నేతలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇపుడు తెలుగు వారి గొంతు సన్నగా మారిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

మళ్లీ నాటి రాజకీయ పరిస్థితి రావాలని తెలుగు గొంతు ఘనంగా జాతీయ రాజకీయ తెర మీద మోగాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే గతంలోనూ రేవంత్ రెడ్డి తెలుగు వారు జాతీయ రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషించాలని కోరుకున్నారు. ఆయన అప్పట్లో కూడా తెలుగు వారి పాత్ర జాతీయ రాజకీయాల్లో ఉండాలని ఆకాంక్షించారు.

ఇపుడు మళ్లీ అదే మాటను ఆయన అంటున్నారు. దీనిని బట్టి చూస్తే రేవంత్ రెడ్డికి జాతీయ రాజకీయాల మీద ఆసక్తి అనురక్తి ఎక్కువగా ఉందా అన్న చర్చ సాగుతోంది. ఆయన ఎంపీగా అయిదేళ్ల పాటు పనిచేశారు. జాతీయ రాజకీయాల గురించి అవగాహన ఉంది. పైగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో ఉన్నారు.

ఇక చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చూస్తున్నారు. రాజకీయంగా మరో రెండు దశాబ్దాల పాటు చురుకైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నుంచి చూసినపుడు రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలలో తెలుగు వారు అని పదే పదే చెప్పడం కూడా ఒక రకమైన చర్చకు దారి తీస్తోంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే చంద్రబాబు గతంలో జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్రను పోషించారు. ఆయన 1996 ప్రాంతంలో యునైటెడ్ ఫ్రంట్ ని కూడా స్థాపించారు. దానికి కన్వీనర్ గా ఉన్నారు. అంతే కాదు వాజ్ పేయ్ టైం లో బాబు ఎన్డీయే కన్వీనర్ గా అతి ముఖ్య పాత్ర పోషించారు. ఇపుడు అయితే విభజన ఏపీలో ఆయన చాలా కార్యక్రమాలు చేయడానికి జాతీయ రాజకీయాన్ని కాస్తా పక్కన పెట్టారు.

ఇక చూస్తే కేసీఆర్ కి జాతీయ రాజకీయాలలో రాణించాలని ఉన్నా ఆయన ఇపుడు మాజీ సీఎం అయ్యారు. ఏడు పదులు దాటిన వయసులో ఉన్నారు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో జాతీయ రాజకీయాల్లో ఈ తరంలో ఆసక్తి ఉన్న వారిగా రేవంత్ రెడ్డి మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా చాలా కాలం పనిచేయాలని అనుకుంటున్నారు.

ఆ మీదట ఆయన జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్రని చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వచ్చారు అంటేనే ఆయనకు ఉన్న పట్టుదల శ్రమ కారణం. అటువంటిది ఆయన తలచుకుంటే తెలంగాణా సీఎం గా ఉంటూ కూడా జాతీయ రాజకీయాల్లో రాణించగలరు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News