త‌మ్ముళ్లు నోరు తెరిచేందుకు వ‌ణికేలా జ‌న‌సేన రిటార్ట్‌

Update: 2018-03-22 07:25 GMT
నువ్వు ఒక‌టంటే నేను రెండు అంట. నువ్వు నాలుగు అంట నేను ప‌ది అంట అన్న‌ది పాత సిద్ధాంతం. నువ్వు ఒక‌టి అంటే నేను వంద అంట అన్న‌ది ఇప్పుడు తాజా స్టైల్‌. తాజాగా అలాంటి ప‌నే చేసిన జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ టీడీపీ త‌మ్ముళ్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. ప్ర‌శ్నిస్తా.. ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టానంటూ నాలుగేళ్లుగా  కామ్ గా ఉన్న ఆయ‌న‌.. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు బాబు పుత్ర‌ర‌త్నం మొద‌లు ఏపీ స‌ర్కారు అవినీతిపై చేసిన విమ‌ర్శ‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

ప‌వ‌న్ ప్ర‌శ్నించ‌టం మొద‌లు పెడితే రాజ‌కీయాలు ఎంత‌లా హీటెక్కుతాయో జ‌న‌సేన అవిర్భావ స‌భ చెప్పేసింద‌ని చెప్పాలి. త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేసిన ప‌వ‌న్ పై తెలుగు త‌మ్ముళ్లు మూకుమ్మ‌డిగా విమ‌ర్శ‌ల్ని సంధిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు మీడియాలో విమ‌ర్శ‌లు సంధిస్తూనే.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఆయ‌న ఇమేజ్ ను ఎంత‌లా డ్యామేజ్ చేయాలో అంత‌లా డ్యామేజ్ చేస్తున్న వైనం జ‌న‌సైనికుల‌కు మంట పుట్టిస్తోంది.

జ‌న‌సేన ఆవిర్భావ సభ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లోనూ ప‌వ‌న్ మాత్ర‌మే ఆన్స‌ర్ చేసిన‌ప్ప‌టికీ.. తాజాగా మాత్రం ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి తెర మీద‌కు వ‌చ్చారు. ఘాటు వ్యాఖ్య‌ల‌తోపాటు.. ఇప్ప‌టివ‌ర‌కూ మీడియాలో పెద్ద‌గా ఫోక‌స్ కాని అంశాల‌తో పాటు.. తెలుగుదేశం పార్టీ నేత‌ల వార‌సుల‌పై టార్గెట్ చేసిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ప‌వ‌న్ ను విమ‌ర్శిస్తున్న నేత‌ల పుత్ర‌ర‌త్నాల‌పై ప‌వ‌న్ సైనికులు చేసిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు అన్న‌ట్లు కాకుండా టీడీపీ వార‌సుల‌పైనే త‌న టార్గెట్ అన్న చందంగా తాజా విమ‌ర్శ‌ల ఉండ‌టం గ‌మ‌నార్హం.  

ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించి ఆ పార్టీ మంత్రులు నారాయ‌ణ‌.. జ‌వ‌హ‌ర్‌.. కేఈ కృష్ణ‌మూర్తి.. ప‌త్రిపాటి పుల్లారావు.. అయ‌న్న‌పాత్రుడు త‌దిత‌రులపై జ‌న‌సేన పార్టీ అధికార ప్ర‌తినిధి శ్రీ‌ధ‌ర్ రియాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. ఏపీ రాష్ట్రంలో నెల‌కొన్న అవినీతి గురించి ప‌వ‌న్ నాలుగేళ్లుగా బాబు దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా చెప్పారు.

హోదా అంశాన్ని ప‌వ‌న్ లేవ‌నెత్త‌టం వ‌ల్లే పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం వ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఊస‌ర‌వెల్లి రాజ‌కీయాలు చేస్తున్న‌ట్లుగా ఆరోపించారు. నారాయ‌ణ విద్యా సంస్థ‌లు ఫీజుల విష‌యంలో కాపీరైట్స్ ను ఉల్లంఘిస్తున్నాయ‌న్నారు. మంత్రి జ‌వ‌హ‌ర్ ప‌వ‌న్ ను విమ‌ర్శ‌లు చేసే ముందు.. త‌న శాఖ‌లోని వైఫ‌ల్యాల గురించి చెబితే మంచిద‌న్నారు.ఇప్ప‌టివ‌ర‌కూ ప్రొహిబిష‌న్ క‌మిటీని ఎందుకు వేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. దీనికి మంత్రి జ‌వ‌హ‌ర్ స‌మాధానం చెప్పాల‌న్నారు.

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి త‌న‌యుడిపై హ‌త్య కేసులు ఉన్నాయ‌ని..అలాంటిది కేఈ ప‌వ‌న్ మీద వ్యాఖ్య‌లు స‌మంజ‌సం కాద‌న్నారు. ముందు ఆయ‌న కుమారుడి వ్య‌వ‌హారాలు తెలుసుకోవాల‌ని.. అవ‌న్నీ అంద‌రికి తెలిసిన‌వేన‌న్నారు. అగ్రిగోల్డ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప‌త్తిపాటి పుల్ల‌రావు ముందు ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌న్నారు.

 మంత్రి మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు త‌న కుమారుడు విశాఖ‌.. హైద‌రాబాద్ ల‌లో ఏమేం చేస్తున్నారో తెలుసుకోవాల‌న్న శ్రీ‌ధ‌ర్‌.. గుంటూరులో అతిసార వ్యాధ‌గ్ర‌స్తుల విష‌యాన్ని ప‌వ‌న్ ప్ర‌స్తావించిన‌ త‌ర్వాతే ప్ర‌భుత్వంలో క‌ద‌లిక వ‌చ్చింద‌న్న‌ది వాస్త‌వం కాదా? అని ప్ర‌శ్నిచార‌. మంత్రి నారా లోకేశ్ పై తాము ఆరోప‌న‌లు చేస్తే.. ఢిల్లీ వాళ్లు ఇచ్చారా? అని అడుగుతున్నార‌ని.. అంటే.. లోకేశ్ మీద స‌మాచారం ఢిల్లీ వ‌ద్ద ఇప్ప‌టికే ఉంద‌న్న‌దే మంత్రి మాటా? అని ఎదురు ప్ర‌శ్నించారు. మొత్తానికి టీడీపీ నాయ‌త‌క్వం నోరు తెర‌వ‌కుండా ఉండేలా.. జ‌న‌సేన నుంచి బ‌ల‌మైన పంచ్ లు ప‌డ్డాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News