మాజీ జేడీ లెక్క‌!... జ‌న‌సేన‌కు ఎన్ని సీట్లంటే?

Update: 2019-04-01 16:45 GMT
సీబీఐ మాజీ జేడీ -  మాజీ ఐపీఎస్ అధికారి వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌... అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఫక్తు పొలిటీషియ‌న్‌ గా మారిపోయార‌నే చెప్పాలి. స‌మాజానికి మ‌రింత సేవ చేయాల‌న్న ల‌క్ష్యంతో ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేసి పారేసి వ‌చ్చిన ల‌క్ష్మీనారాయ‌ణ‌... ఎన్నిక‌ల ముందు దాకా సొంత పార్టీ పెట్టే దిశ‌గానే సాగారు. అయితే ఎన్నిక‌లు ముంచుకొచ్చిన నేప‌థ్యంలో ఏమాత్రం ఆపులోక‌పోయిన ఆయ‌న నేరుగా... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆధ్వ‌ర్యంలోని జ‌న‌సేన‌లో చేరిపోయారు. తెలుగు నేల‌లో సీబీఐ మాజీ జేడీగా పెద్ద ఫాలోయింగ్ సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఫాలోయింగ్ తో రాజ‌కీయాల్లోనే రాణిస్తాన‌నే భావ‌న‌తోనే ఆయ‌న పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చార‌న్న వాద‌న కూడా లేకపోలేదు. ఏదైతేనేం... ఖాకీ డ్రెస్ వ‌దిలేసి ఖ‌ద్ద‌ర్ వేసుకున్న వీవీ... ఇప్పుడు అస‌లు సిస‌లు పొలిటీషియ‌న్‌గానే మారిపోయార‌ని చెప్పాలి.

ఇక మాజీ జేడీ ఎప్పుడెప్పుడు త‌మ వ‌ద్ద‌కు వ‌స్తారా? అంటూ ఎదురు చూసిన ప‌వ‌న్... ఆయ‌న వ‌చ్చీ రాగానే విశాఖ పార్ల‌మెంటు సీటును ఇచ్చేశారు. ప‌వ‌న్ మాదిరే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండానే విశాఖ‌లో ల్యాండ్ అయిపోయిన ల‌క్ష్మీనారాయ‌ణ త‌న‌దైన శైలి ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా పొలిటీషియ‌న్లు ఎన్ని మాయ‌లు చేస్తారో మ‌న‌కు తెలిసిందే. ఈ విష‌యంలో తాను ఏ ఒక్క రాజ‌కీయ నేత‌కు త‌క్కువేమీ కాద‌న్న కోణంలో సాగుతున్న వీవీ.. మీడియా కెమెరాల‌కు ఫోజులిస్తూనే మీడియా స‌మావేశాలు కూడా పెట్టేస్తున్నారు. విశాఖ‌లో త‌న‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను చూసి ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారో - లేక పాలిటిక్స్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత మిగిలిన వారి మాదిరే తాను మాట్లాడాల‌నుకున్నారో తెలియ‌దు గానీ... ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో విజ‌యం సాధించి అధికారం కూడా చేప‌ట్ట‌డం ఖాయ‌మేన‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌లోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా మీట్ లో మాట్లాడిన మాజీ జేడీ... ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అదికారం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మేన‌ని తేల్చేశారు.

అంతేకాకుండా ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఎన్ని సీట్లు సాధిస్తుంద‌న్న విష‌యాన్ని కూడా వెల్ల‌డించేసి మీడియా మిత్రుల‌కు షాకిచ్చార‌ని చెప్పాలి. అయినా మాజీ జేడీ లెక్క‌ల్లో జ‌న‌సేన‌కు ఎన్ని సీట్లు వ‌స్తాయంటే... 175 అసెంబ్లీ సీట్ల‌లో జ‌న‌సేన 120 సీట్ల‌లో మాత్ర‌మే పోటీ చేస్తోంది క‌దా. ఆ 120 స్థానాల్లో జ‌న‌సేన ఏకంగా 88 చోట్ల విజ‌యం సాధిస్తుంద‌ట‌. అంత‌టితో ఆగ‌ని ల‌క్ష్మీనారాయ‌ణ‌... లోక్ స‌భ ఫ‌లితాల‌పై కూడా మాట్లాడేశారు. మొత్తం 25 ఎంపీ సీట్ల‌లో 15 నుంచి 20 ఎంపీ సీట్ల దాకా జ‌న‌సేన గెలుస్తుంద‌ని ఆయ‌న చెప్పేశారు. అయినా 25 ఎంపీ సీట్ల‌లో 3 సీట్ల‌ను బీఎస్పీకి కేటాయించిన జ‌న‌సేన‌... సీపీఐ - సీపీఎంల‌కు చెరో రెండు ఎంపీ సీట్ల‌ను కేటాయించింది క‌దా. ఈ లెక్క‌న మిత్ర‌ప‌క్షాల‌కు ఇచ్చిన 7 సీట్ల‌ను తీసివేస్తే... జ‌న‌సేన పోటీ చేస్తున్న ఎంపీ సీట్లు 18 మాత్ర‌మే. ఈ లెక్క‌న జ‌న‌సేన 18 సీట్ల‌లో పోటీ చేస్తుంద‌నే చెప్పాలి. మ‌రి ఆ పార్టీ గెలిచే సీట్లు 15 అని చెబితే ఎలాగోలా స‌రిపెట్టుకోవ‌చ్చు గానీ... మ‌రీ 18 చోట్ల పోటీ చేసి 20 చోట్ల గెలుస్తామ‌ని మాజీ జేడీ ఏ లెక్క‌న చెప్పారో అర్థం కావ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే జ‌న‌సేన‌తో పాటు ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న మిగిలిన పార్టీలు గెలిచే ఎంపీ సీట్ల‌ను కూడా జ‌న‌సేన ఖాతాలోనే వేసేసి మాజీ జేడీ ఈ లెక్క‌లు చెప్పారేమో. లెక్క‌ల సంగ‌తి ఎలా ఉన్నా... జ‌న‌సేన గెలిచే సీట్ల సంఖ్య ఇదేనంటూ ఆయ‌న చెప్పిన మాట‌లు ఇప్పుడు నిజంగానే ఆస‌క్తిక‌రంగా మారిపోయాయ‌ని చెప్పాలి.


Tags:    

Similar News