జనసేనాని కొత్త కార్యక్రమం.. జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు!

Update: 2022-11-12 09:31 GMT
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ దూకుడు పెంచారు. వరుస పెట్టి పర్యటనలతో జనసేన శ్రేణుల్లో జోష్‌ పెంచుతున్నారు. ఇటీవల విశాఖ పర్యటనలో జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకోవడం, కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేయడం, అర్ధరాత్రి హోటల్‌ రూమ్‌కు వచ్చి నేతలను అరెస్టు చేయడం, పవన్‌ కల్యాణ్‌ను ర్యాలీని అడ్డుకోవడం, ఆయనకు నోటీసులు ఇవ్వడం వంటివాటితో విశాఖలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.

అలాగే ఇటీవల గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన పార్టీ మద్దతుదారుల ఇళ్లను వైసీపీ ప్రభుత్వం కూల్చివేయడంపై కూడా పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. స్వయంగా ఇప్పటం గ్రామాన్ని సందర్శించి ప్రజలకు అండగా నిలిచారు.

ఇప్పుడు మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు విశాఖలో ఆయనను కలిశారు.. పవన్‌. ప్రస్తుతం ఇంకా అక్కడే ఉన్నారు. జగనన్న ఇళ్లు – పేదలకు కన్నీళ్లు పేరిట జనసేన పార్టీ చేపట్టనున్న కార్యక్రమంలో పవన్‌ పాల్గొననున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల పేరుతో భూములను సేకరించడంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. ఎకరం రూ.15 లక్షలు, రూ.20 లక్షలు చేయని భూములను కూడా రూ.40 లక్షలు, రూ.50 లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారని జనసేన విమర్శిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో చేతులు మారాయని ఆరోపణలు గుప్పిస్తోంది.

మరోవైపు జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు.. విద్యుత్, నీటి సౌకర్యం, డ్రైనేజీ వసతులు, రోడ్లు కల్పించకపోవడంతో పేదలకు ఆ స్థలాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని జనసేన పార్టీ చెబుతోంది.

ఈ నేపథ్యంలో జగనన్న ఇళ్లు–పేదలకు కన్నీళ్లు పేరిట ఆ పార్టీ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా నవంబర్‌ 12, 13, 14తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీలు/టిడ్కో ఇళ్ల వద్ద జనసేన సామాజిక పరిశీలనా కార్యక్రమం చేపడుతోంది.

ఇందులో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆయా    నియోజకవర్గాల్లో చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఫోటో/వీడియోలతో సహా #JaganannaMosam  అనే హ్యాష్‌టాగ్‌ జత చేసి  6304900820, 6304900658 నంబర్లకు పంపాలని జనసేన పార్టీ కోరింది.

దీంతో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో జగనన్న కాలనీల్లో ఇళ్ల పరిస్థితిని ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

మరోవైపు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్వయంగా విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించనున్నారు. అక్కడ 397 ఎకరాల్లో జగనన్న ఇళ్లు నిర్మిస్తామని జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అక్కడ సీఎం జగన్‌ గతంలోనే శంకుస్థాపన చేసి పైలాన్‌ను కూడా ఆవిష్కరించారు. అక్కడ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సదుపాయం, విద్యుత్‌ తదితర అన్ని వసతులు కల్పిస్తామని జగన్‌ చెప్పారు. గుంకలాంను నగర పంచాయతీని కూడా చేస్తామన్నారు.

ఈ నేపథ్యంలో గుంకలాంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలయ్యాయా? అక్కడ ఇళ్ల పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలను పవన్‌ కల్యాణ్‌ స్వయంగా పరిశీలించనున్నారు. పథకం అమలు తీరుని తెలుసుకోవడానికి లబ్ధిదారులతో మాట్లాడతారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News