నవ్వొద్దు ప్లీజ్! జనసేనకు 71 సీట్లొస్తాయట..!!

Update: 2018-10-20 11:01 GMT
ఉట్టికేగలేనమ్మ స్వర్గానికేగిందని సామెత. ఏపీలో జనసేన పలుకుతున్న బీరాలు... అందుకు ఆధారంగా తీసుకొస్తున్న ఫేక్ సర్వేలను చూసి అక్కడ రాజకీయ పార్టీలన్నీ నవ్వుకుంటున్నాయి. పట్టుమని 10 సీట్లకు సరైన అభ్యర్థులు లేని జనసేన ఇప్పుడు 71 సీట్లతో అధికారంలోకొస్తుందంటూ ఆ పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.

అందరూ వాడుకున్నట్లే జనసేన అభిమానులు కూడా ఈ సర్వేకు ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్ పేరును వాడుకుంది. తానేమీ సర్వేలు చేయలేదని ఆయన ఇప్పటికే ఒకట్రెండుసార్లు మొత్తుకున్నా కూడా ఇప్పుడు జనసేన ఫ్యాన్స్ ఆయన పేరుతో కొత్త సర్వేను జనంపైకి వదులుతున్నారు. ఆ సర్వేలో వారు చెబుతున్న లెక్కలు - అంచనాలు చూసి జనం పడీపడీ నవ్వుతున్నారు. 71 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా జనసేన అవతరిస్తుందని జనసేన సోషల్ మీడియా దళాలు ఫేస్ బుక్ - ట్విటర్ - యూట్యూబ్ అన్న తేడా లేకుండా అంతటా తెగ ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఇప్పటికి ఆ పార్టీకి ఎన్ని సీట్లకు అభ్యర్థులున్నారో మాత్రం చెప్పలేకపోతున్నాయి.
   
ఇంకో గొప్ప విషయం ఏంటంటే... రాయలసీమలో జనసేన దుమ్ము రేపనుందట. మరీ ముఖ్యంగా పవన్‌ ను పరుగులు తీయించారని చెప్పే అనంతపురంలో ఆ పార్టీకి అయిదు సీట్లు వస్తాయట. ఎందుకోగానీ వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడప గురించి మాత్రం పవన్ అభిమానులు ఎక్కువ గొప్పలు చెప్పుకోలేదు. అక్కడ రెండు సీట్లు మాత్రమే గెలుస్తామంటున్నారు. కర్నూలుకు వచ్చేటప్పటికి అయిదు సీట్లు తమవేనంటున్నారు. చిత్తూరు కూడా కొల్లగొట్టేస్తారట.
   
ఇక సామాజికవర్గంపై బాగా ఆశలు పెట్టుకోవడం వల్లో ఏమో కానీ ఉభయగోదావరి జిల్లాల్లో 29 సీట్లకు లెక్కేశారు. పశ్చిమలో క్లీన్ స్వీప్ అని చెబుతున్నారు. ఇలా ఏ జిల్లాకాజిల్లా లెక్కలు వేసి ఓవరాల్ గా 71 సీట్లు సాధిస్తామని చెప్పుకొంటున్నారు. వైసీపీకి 53 సీట్లను - టీడీపీకి 51 సీట్లను దయతలచి వదిలేశారు.
   
జనసేన అభిమానులు స్ప్రెడ్ చేస్తున్న ఈ సర్వేపై వైసీపీ - టీడీపీ అభిమానులు అదే స్థాయిలో కౌంటర్లేస్తున్నారు. బహుశా జనసేన పోటీ చేయాలనుకుంటున్న స్థానాల సంఖ్య కావొచ్చని.. పవన్ అభిమానులు ఈ విషయం సరిగా అర్థం చేసుకోకుండా గెలిచే సీట్లని ప్రచారం చేసుకుంటున్నారంటూ సెటైర్లేస్తున్నారు.


Tags:    

Similar News