హర్యానా ఎంతలా అట్టుడుకుతోందంటే..?

Update: 2016-02-21 05:17 GMT
చిన్న రాష్ట్రమైన హర్యానా ఇప్పుడు అట్టుడిగిపోతోంది. తమను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న దశాబ్దాల డిమాండ్ ను సాధించేందుకు హింసను ఆశ్రయించిన జాట్లు.. హర్యానాను ఆగమాగం చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు చేస్తున్న ఆందోళనతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. శుక్రవారంతో పోలిస్తే.. శనివారం ఆందోళనలు మరింత తీవ్రతరం కావటమే కాదు.. ఎప్పుడు ఎక్కడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. జాట్ల ఆగ్రహజ్వాలలు హర్యానాను తగలబెట్టేస్తున్న దుస్థితి.

ఒక్క శనివారం రోజున జాట్ల ఆందోళనకు బూడిదైన వాటి వివరాలు చూస్తే.. ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా పడిపోయాయన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. కనిపించిన దేన్నీ విడిచిపెట్టకుండా అగ్నికి ఆహుతి చేస్తున్న ఆందోళనకారులు బీభత్సంతో ఆ చిట్టి రాష్ట్రం వణికిపోతోంది. శనివారం చోటు చేసుకున్న పరిణామాల్లో.. శాంతిభద్రతల్ని పరిరక్షించేందుకు కాల్పులు జరిపేందుకు వెనుకాడని భద్రతాదళాల కారణంగా ఐదుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

పెట్రోల్ పంపు.. పోలీస్ స్టేషన్.. రైల్వే స్టేషన్.. బస్సులు.. కార్లు.. వాహనాలు.. ప్రభుత్వ కార్యాలయాలు.. పాల బూత్ లు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ ఎంత విధ్వంసం సృష్టించాలో అంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. భయం గుప్పిట్లో హర్యానా రాష్ట్రం బిక్కుబిక్కు మంటోంది. ఆందోళనకారులు రెచ్చిపోయిన ఫలితంగా ఇప్పటికే రెండు పట్టణాల్లో అమల్లో ఉన్న కర్ఫ్యూ.. మరో ఐదు పట్టణాలకు విస్తరించారు.

జాట్లు చేస్తున్న ఆందోళనను విరమిస్తే వారి డిమాండ్లను నెరవేరుస్తామని హర్యానా ప్రభుత్వం చెబుతుంటే.. ఇలాంటి మాటలు ఇప్పటికే చాలా చూశామని.. తమ డిమాండ్ ను ఆర్డినెన్స్ రూపంలో జారీ చేస్తే తప్ప తమ ఆందోళనలను విరమించమని అఖిల భారత జాట్ల రిజర్వేషన్ సంఘర్షణ సమితి స్పష్టం చేస్తోంది.

ఆందోళనకారుల దాడికి 7 రైల్వే స్టేషన్లు బుగ్గి అయ్యాయి. హర్యానాలో చోటు చేసుకున్న ఆందోళన ప్రభావం ఐదు రాష్ట్రాల మీద పడింది. ఆందోళనకారులు వ్యూహాత్మకంగా రోడ్లను తవ్వేయటంలో.. అల్లర్లను అడ్డుకునేందుకు.. శాంతిభద్రతల్ని సాధారణ స్థాయికి తెచ్చేందుకు సైన్యం రంగంలోకి దిగింది. అయితే.. వారిని రాకుండా ఉండేందుకు రోడ్డు.. రైలు మార్గాలు అనుకూలంగా లేకపోవటంతో హెలికాఫ్టర్లలో సైనికుల్ని తరలింపు చేపట్టారు. తాజా ఆందోళనలతో 800 రైళ్ల రాకపోకలకు ప్రభావితం అయ్యాయి. ఒక్క రైల్వేలకు వచ్చిన నష్టం రూ.200కోట్లుగా చెబుతున్నారు. జాట్ల ఆందోళన ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీ మీద ప్రభావం పడింది. హర్యానా నుంచి  వచ్చే పలు నిత్యవసరాల రాకపోకలు ఆగిపోవటంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది. తాగునీటి సరఫరాకు కూడా ఒకట్రెండు రోజుల్లో అంతరాయం ఏర్పడే వీలుందని భావిస్తున్నారు. మొత్తంగా జాట్ల ఆందోళన హర్యానా రాష్ట్రాన్నేకాదు.. కేంద్రానికి సైతం చెమటలు పట్టేలా చేస్తోంది.
Tags:    

Similar News