సైనికుల నిరసనను తిరుగుబాటుగా చిత్రీకరించారే

Update: 2016-05-16 07:15 GMT
క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ.. దేశం కోసం.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కంకణబద్ధులైన సైనికులుగా భారత సైన్యానికి మంచిపేరు ఉంది. పొరుగున ఉన్న పాక్ సైన్యం మాదిరి కాకుండా.. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటారు. అలాంటిది సైనికుల పటాలంలో చోటు చేసుకున్న ఒకచిన్న నిరసనను భారతసైన్యం తిరుగుబాటుగా అభివర్ణిస్తూ కొన్ని వెబ్ సైట్లు వార్తలు రాయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్ లో మాదిరి భారత్ లో సైన్యం తిరుగుబాటు చేసే అవకాశం ఎంతమాత్రం లేకున్నా.. ఆ తరహా వార్తలు వండిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరికొందరి మాట మరోలా ఉంది.

అసలు నిప్పు లేకుండా పొగ రాదుగా? అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభిస్తోంది. సైన్యంలో చోటు చేసుకున్న ఒక చిన్న నిరసనను తిరుగుబాటుగా అభివర్ణిస్తూ తొందరపాటుతో వ్యవహరించిన దాని ఫలితమే ‘తిరుగుబాటు వార్తలు’’గా చెబుతున్నారు. ఇంతకీ జరిగిందేమిటంటే..ఈశాన్య భారతంలోని ఒక సైనిక పటాలంలోని ఒక సైనికుడికి ఛాతీ నొప్పితో బాధ పడుతున్నట్లుగా  చెప్పటంతో వైద్యులు అతన్ని పరీక్షించారు. అతను ఫిట్ గా ఉన్నట్లు తేల్చారు.దీంతో అతన్ని ట్రైనింగ్ లో పాల్గొనాలని కోరారు.

ట్రైనింగ్ లో ఉన్న అతను అస్వస్థతతో కన్నుమూశారు. దీంతో.. సైనికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అనారోగ్యంతో ఉన్నా.. ఆరోగ్యంతో ఉన్నట్లుగా డాక్టర్ ఏ విధంగా సర్టిఫై చేస్తారని ప్రశ్నిస్తూ.. నిరసన చేపట్టారు. అయితే.. దీన్ని తిరుగుబాటు చర్యగా అభివర్ణిస్తూ హడావుడి చేయటంతో అత్యుత్సాహానికి గురైన కొన్ని మీడియా సంస్థలు సైనిక తిరుగుబాటు మొదలైనట్లుగా బాధ్యతారాహిత్యంతో రాతలు రాసేశారు. దీంతో ఒక్కసారి ఆందోళన వ్యక్తమైంది. అయితే.. ఇదంతా ఉత్తదేనని.. నిరసనను తప్పుగా కోట్ చేయటం వల్ల ఇలాంటి వార్తలు వచ్చాయని.. వాస్తవం అందుకు భిన్నంగా ఉందని సైనిక వర్గాలు తేలుస్తున్నాయి.
Tags:    

Similar News