కన్ఫ్యూజ్ చేస్తున్న ‘అమ్మ’ ప్రశ్నలు

Update: 2016-03-23 06:10 GMT
దేశ రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే.. తమిళనాడు రాజకీయం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక.. అన్నాడీఎంకే  అధినేత్రి జయలలిత తీరు ఎంత భిన్నంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరికొద్దిరోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేతలకు అమ్మ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా అమ్మ అడుగుతున్న కొన్ని ప్రశ్నలు అభ్యర్థులకు అర్థం కాని పరిస్థితి. అయితే.. కొందరు నేతలు మాత్రం తెలివిగా అర్థం చేసుకొని అమ్మ మనసును దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థులకు చెమటలు పట్టించేలా ఉంటున్న ఆ ప్రశ్నల్లో ఒకటి చూస్తే.. టిక్కెట్టు ఆశిస్తున్న ఆశావాహుల్ని ప్రశ్నిస్తున్న జయలలిత.. మీరు ‘‘జే’’ వర్గమా? ‘‘జేఏ’’ వర్గమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

దీనికి సమాధానం చెప్పేందుకు తల పట్టుకుంటున్నారు. ఎందుకంటే.. అమ్మ శ్లేష అర్థం కాకపోవటమే. అయితే.. మరికొందరు మాత్రం అమ్మ మనసును జాగ్రత్తగా ఫాలో అయిన వారు చటుక్కున సమాధానం చెప్పేసి.. అమ్మ అనుగ్రహం పొందేలా వ్యవహరిస్తున్నారు.  ఇంతకీ జే.. జేఏ వర్గాల లెక్కలోకి వెళితే.. ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకే రెండుగా చీలిపోవటం.. ఒక వర్గానికి జయలలిత (జే) నేతృత్వం వహిస్తే.. మరో వర్గానికి జానకి రామచంద్రన్ (జేఏ) నేతృత్వం వహించారు. నిజానికి ఈ వర్గాల పేర్లు మర్చిపోయి చాలా రోజులే అయ్యింది. కానీ.. వాటిని ప్రశ్నిస్తూ టిక్కెట్టు ఆశావాహుల తెలివితేటల్ని లెక్కించే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. అమ్మ ప్రశ్నకు కొందరు బిక్కముఖం వేస్తే.. మరికొందరు మాత్రం తెలివిగా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏమైనా అభ్యర్థుల ఎంపికలో అమ్మ ఎంత చతురత ప్రదర్శిస్తోందో కదా?
Tags:    

Similar News