‘అమ్మ’ పేరు లేకున్నా అదిరిపోయే పథకమిది

Update: 2016-02-18 13:19 GMT
తనను అభిమానంగా పిలుచుకునే పేరుతో అదిరిపోయే పథకాల్ని ప్రకటించటం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అలవాటు. తాజాగా ఆమె నోటి నుంచి మరో వరం బయటకు వచ్చింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. తన సంక్షేమ పథకాలతో తమిళుల మనసును దోచుకోవాలని భావిస్తున్న ఆమె.. ఈసారి తన పేరు లేకుండానే ఒక భారీ పథకాన్ని ప్రకటించారు.

ఈ పథకం గురించి చెప్పుకొస్తే.. ఇకపై తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరానికి చెందిన మెట్రో ఏసీ బస్సుల్లో 60 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ నెల 24 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం విపక్షాల్ని దెబ్బ తీస్తుందని చెబుతున్నారు. ప్రతి నెలా సీనియర్ సిటిజన్ కు 10 టోకెన్లు ఇస్తారు. వీటితో మెట్రో ఏసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ఈ టోకెన్లను బస్ డిపోల నుంచి లేదా రవాణా శాఖ వెబ్ సైట్ నుంచి పొందే వీలుంది. తొలుత చెన్నైలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేసి.. తర్వాతి దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు. అమ్మ నీరు.. అమ్మ మెడికల్ షాపు.. అమ్మ ఫోన్.. అమ్మ సిమెంట్.. ఇలా ప్రతి పథకంలోనే తన పేరును మిస్ కాకుండా జాగ్రత్తపడే అమ్మ.. తాజా పథకంలో తన పేరు ప్రస్తావన లేకుండా నిర్ణయం తీసుకోవటం గమనార్హం.
Tags:    

Similar News