కేసుల భ‌య‌మే జ‌య‌ను చంపేసిందా?

Update: 2018-03-21 10:47 GMT
త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణించి ఇప్ప‌టికే ఏడాది దాటిపోయింది. రెండున్న‌ర నెల‌ల‌కు పైగా చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో సుదీర్ఘ చికిత్స తీసుకున్నా ఫ‌లితం లేక‌పోగా... ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంద‌నుకుంటున్న వేళ వ‌చ్చిన గుండె పోటు ఆమె ప్రాణాల‌ను తీసేసింది. తంబీలంతా అమ్మ‌గా కొలిచే జ‌య మ‌ర‌ణం త‌మిళ‌నాట పెను విషాదాన్ని నింపేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. విషాదంతో పాటుగా జ‌య మ‌ర‌ణం త‌మిళ‌నాడు రాజకీయాల‌ను క‌కావిక‌లం చేసింద‌ని చెప్ప‌దు. వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం అధికారంలోకి వ‌చ్చిన అన‌తి కాలంలోనే అనారోగ్యానికి గురైన జ‌య మ‌ర‌ణం కార‌ణంగా అన్నాడీఎంకే ప‌గ్గాల‌ను చేజిక్కించుకునేందుకు ఆ పార్టీ నేత‌లు, అమ్మ నెచ్చెలి వీకే శ‌శిక‌ళ‌లు అమ‌లు చేసిన పోటాపోటీ వ్యూహాలు ఆ రాష్ట్ర రాజ‌కీయాలు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స్టోరీని త‌ల‌పించాయి. జ‌య మ‌ర‌ణంపై ప‌లువురు వ్య‌క్తులు అనుమానం వ్య‌క్తం చేస్తూ కోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేసిన నేప‌థ్యంలో అస‌లు జ‌య మ‌ర‌ణానికి కార‌ణాలేవ‌న్న విష‌యాన్ని నిగ్గు తేల్చేందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఏకంగా ఓ క‌మిష‌న్‌నే నియ‌మించింది. ఈ క‌మిష‌న్... త‌న విచార‌ణ‌లో భాగంగా జ‌య స‌న్నిహితులు, ప‌లువురు కీల‌క అధికారులు, ఆమె ప‌ని మ‌నుషులు.. ఇలా చాలా మందినే విచారించింది. ఇందులో భాగంగా నిత్యం జ‌య వెంటే న‌డిచిన ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ‌ను కూడా క‌మిష‌న్ విచారించింది.

జ‌య‌పై న‌మోదైన ఆక్ర‌మాస్తుల కేసులో స‌హ నిందితురాలిగా ఉన్న శ‌శిక‌ళ‌... కేసులో దోషిగా తేలిన కార‌ణంగా ప్ర‌స్తుతం జైలు జీవితం అనుభ‌విస్తున్నారు. ఈ క్ర‌మంలో నిన్న ఆమె భ‌ర్త న‌ట‌రాజ‌న్ అనారోగ్యంతో మృతి చెందిన ద‌రిమిలా కోర్టు ఇచ్చిన పెరోల్‌తో ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా విచార‌ణ క‌మిష‌న్ ముందు శ‌శిక‌ళ ఏం చెప్పాన‌న్న విష‌యాలు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా ఇలా ఉన్నాయి.  త‌న‌పై న‌మోదైన అక్ర‌మాస్తుల కేసుల భ‌యంతోనే జ‌య తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యార‌ని, ఆ కార‌ణంగా ఆమె ఆరోగ్యం క్షీణించింద‌ని, త‌దుప‌రి ఆసుప‌త్రిలో చేర్చినా ఫ‌లితం లేక‌పోయింది. కేసుల భ‌యం కార‌ణంగా తిర‌గ‌బెట్టిన అనారోగ్యానికి 70 రోజుల‌కు పైగా చికిత్స అందించినా... ఫ‌లితం లేక‌పోయింది. అనారోగ్యానికి చికిత్స కోసం ఆసుప‌త్రికి స‌జీవంగానే వెళ్లిన జ‌య‌... చివ‌ర‌కు నిర్జీవంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. అస‌లు జ‌య‌ను ఆసుప‌త్రిలో చేర్చిన రోజున ఏం జ‌రిగింద‌న్న విష‌యం తేలితే... జ‌య మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాన్ని నిగ్గు తేల్చేయొచ్చ‌న్న కోణంలో దృష్టి సారించిన విచార‌ణ క‌మిష‌న్‌... ఆ అంశంపైనే శ‌శిక‌ళ‌ను కూడా విచారించింది. తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న జ‌య 2016 సెప్టెబంర్ 22న అపోలో ఆసుప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే.  స్ఫృహ కోల్పోయిన తర్వాతే ఆసుపత్రికి జయలలితను తరలించార‌ట‌. తీవ్ర జ్వరంతో ఉన్న జయలలితను ఆసుప్రతికి రావాలని వైద్యులు సూచించినా ఆమె నిరాకరించారట‌. రాత్రి సమయంలో ఆమె స్పృహ కోల్పోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆమెను హాస్పిటల్‌ కు తీసుకెళ్లినట్లు శ‌శిక‌ళ చెప్పిన‌ట్లు స‌మాచారం.

2016 సెప్టెబంర్ 22న రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో జయలలిత బ్రష్ చేసుకొనేందుకు వాష్‌రూమ్‌కు వెళ్ళారని, అయితే బాత్‌రూమ్‌లోనే ఆమె కిందపడిపోయిందని శశికళ చెప్పారు.అప్పటికే తీవ్ర జ్వరంగా ఉందన్నారు. అయితే జ్వరంగా ఉన్న సమయంలో కిందపడిన తర్వాత సహయం కోసం శ‌శిక‌ళ‌ను జ‌య పిలిచార‌ట‌.  బాత్‌రూమ్ ‌నుండి ఆమెను బయటకు తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టిన కొద్దిసేపటికే జ‌య‌ స్పృహ కోల్పోయారు. దీంతో తన బంధువైన డాక్టర్‌ శివకుమార్‌ కు శశిక‌ళ‌ పోన్ చేశారు. అతను వచ్చి జయలలితను పరీక్షించిన‌ తర్వాత ఆపోలో ఆసుపత్రి వైస్ చైర్ పర్సన్ ప్రీతా రెడ్డి భర్త విజయ్‌ కుమార్ రెడ్డికి పోన్ చేసి అంబులెన్స్‌ ను పంపించాలని శ‌శిక‌ళ కోరార‌ట‌. అపోలో ఆసుపత్రి నుండి రెండు అంబులెన్స్‌ లు రాగా... అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో జయకు స్పృహలోకి వచ్చిందని, త‌న‌ను ఎక్కడికి వెళ్తున్నామని జయ ప్రశ్నించారట‌. ఇదిలా ఉంటే... ఆ రోజు ఉదయం జయలలితను రెండు సార్లు డాక్టర్ శివకుమార్ పరీక్షించి, ఆసుపత్రికి రావాలని సూచించినా జ‌య‌ వినలేదట.  అక్రమాస్తుల కేసుతో జయ తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, ఈ ఒత్తిడి కారణంగానే ఆమె ఆరోగ్యం క్షీణించిందని శశికళ చెప్పిన‌ట్లు స‌మాచారం.

Tags:    

Similar News