చిరులా చేయొద్దంటూ ర‌జ‌నీకి ఆమె స‌ల‌హా

Update: 2017-05-29 05:04 GMT
కొన్ని నిర్ణ‌యాలు మ‌చ్చ‌లా మిగిలిపోతుంటాయి. అందుకే కీల‌క నిర్ణ‌యాల్ని తీసుకునేట‌ప్పుడు ఆచితూచి తీసుకోవ‌ట‌మే కాదు.. భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల‌ని చెబుతుంటారు. తాజా ఉదంతం చూస్తే.. ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. రాజ‌కీయ పార్టీని పెట్ట‌టం పెద్ద విష‌యం కాదు. కానీ.. దాన్ని కొన‌సాగించ‌టం.. ప‌వ‌ర్ లోకి తీసుకురావ‌ట‌మే అస‌లు విష‌యం. భారీ అంచ‌నాల మీద పార్టీని ప్ర‌క‌టించి.. అధికార‌మే ల‌క్ష్యంగా అడుగులు వేసి.. ఆ త‌ర్వాత వెన‌క్కి త‌గ్గి.. ఆపై పార్టీని విలీనం చేసేసిన మెగాస్టార్ చిరంజీవి ఉదంతాన్ని తాజాగా ప్ర‌స్తావించారు ప్ర‌ముఖ సినీన‌టి క‌మ్ రాజ‌కీయ నేత జ‌య‌ప్ర‌ద‌.

వెండితెర మీద వెలిగిపోయిన ఈ సీనియ‌ర్ న‌టి.. రాజ‌కీయంగా త‌న స‌త్తాను చాటుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో చిరు.. ర‌జ‌నీల‌తో సినిమాల్లో న‌టించిన జ‌య‌ప్ర‌ద‌.. తాజాగా రజ‌నీ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం మీద ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి చిరు.. ర‌జ‌నీల‌తో పోలిస్తే జ‌య‌ప్ర‌ద పొలిటిక‌ల్ అనుభ‌వంలో మాత్రం ఆమె సీనియ‌ర్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా ఆమె మాట్లాడుతూ.. ర‌జ‌నీకి సిన్సియ‌ర్ స‌ల‌హాను ఇచ్చారు. ర‌జ‌నీ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం మీద వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో.. ఆయ‌న్ను రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆహ్వానించారు. ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లో వ‌స్తే విజ‌యం సాధించ‌టం ప‌క్కా అన్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసిన జ‌య‌ప్ర‌ద‌.. మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. మెగాస్టార్ చిరంజీవిలా మాత్రం పార్టీ పెట్టి.. మ‌ళ్లీ వెన‌క‌డుగు వేయ‌కూడ‌ద‌న్న అభిలాష‌ను ఆమె వ్య‌క్తం చేశారు.

ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రావ‌టానికి ఇదే స‌రైన స‌మ‌యం అన్న ఆమె.. ఎంత ఎత్తుకు ఎదిగినా సామాన్యుడిలా వ్య‌వ‌హ‌రించే ర‌జ‌నీ వ్య‌క్తిత్వాన్ని ఆమె పొగిడేశారు. ర‌జ‌నీని రాజ‌కీయాల్లోకి రావాల‌న్న జ‌య‌ప్ర‌ద అభిలాష ఓకే అయినా.. ఈ క్ర‌మంలో ఆమె నోటి నుంచి వ‌చ్చిన చిరంజీవి ప్ర‌స్తావ‌న విన్న‌ప్పుడు.. రాజ‌కీయంగా ఆయ‌నేం త‌ప్పు చేశార‌న్న‌ది ఇట్టే అర్థం కాక మాన‌దు. ఏమైనా.. జ‌య‌ప్ర‌ద చుర‌కను నోట్ చేసుకోవాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News