ఇద్దరు చంద్రుళ్ల లెక్క చెప్పిన జేపీ

Update: 2016-11-24 07:30 GMT
తెలుగు నేల మీద మేధావి ట్యాగ్ లైన్ ఎవరికి ఇవ్వాలన్న జాబితా ఒకటి తయారు చేస్తే.. ఆ జాబితాలో పది పేర్లు మాత్రమే ఉంటే.. అందులోతప్పనిసరిగా ఉండాల్సిన పేరు లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ. ఆయన వాదనలు.. నిర్ణయాలు.. ఆయన చేసిన పోరాటాలకు సంబంధించి బయట ప్రపంచానికి తెలిసింది తక్కువనే చెప్పాలి. అలా అని జేపీ పై నుంచి ఊడిపడ్డ బంగారం ముద్ద అని కూడా చెప్పట్లేదు. సామాజిక అంశాల పట్ల ఆయనకున్న పట్టు.. అవగాహన.. వ్యవస్థను నడిపించే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశంపై ఆయన మాటల్ని వినాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని చెప్పకతప్పదు. ఒక్కసారి మాట్లాడటం మొదలు పెడితే.. ఆపటం కాస్త కష్టమే అయినప్పటికి ఆయనతో మాట్లాడినంత సేపు విషయాల మీద అవగాహన అంతకంతకూ పెరుగుతుంటుంది. రాజకీయంగా విఫలమైనా.. మేధావిగా ఆయన్ను గుర్తించే విషయంలో తక్కువ చేయలేం. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన టీవీ ఛానల్ లో ఆయనతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను చేశారు.

ఈ సందర్భంగా జేపీ చాలా అంశాలపై తన అభిప్రాయాన్ని సూటిగా.. సుత్తి కొట్టకుండా చెప్పేయటం ఒక ఎత్తు అయితే.. వివాదాస్పద అంశాలు..స్పైసీగా ఉండే విషయాల మీద ఆయన మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. కానీ.. అందుకు భిన్నంగా ఆయన తాజా ఇంటర్వ్యూలో మాత్రం తన తీరు కాస్త మార్చుకున్న విధానం కనిపిస్తుంది. ఏపీ రాజధాని అమరావతి మీదా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు.. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి ప్లస్సులు.. మైనస్సులు ప్రస్తావించటమే కాదు.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేందుకు అస్సలు వెనుకాడలేదు. సదరు ఇంటర్వ్యూలోజేపీ చెప్పిన అంశాల్లో కీలక అంశాల్ని చూస్తే..

అమరావతి నెంబర్ వన్ రాజధాని అనటంపై..

ప్రజల హృదయాలు గాయపడ్డాయి కాబట్టి.. హైదరాబాద్ కు ధీటుగా ఏర్పాటు చేసుకుంటామనటం తప్పేం కాదు. కానీ.. రాజధాని సహజంగా నిర్మాణం కావాలి. ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి. విద్య.. ఆరోగ్యం.. ఉపాధి ఇలా ఒక దానితో మరొకటి సమకూరితేనే రాజధాని వస్తుందే తప్ప ఆర్డర్ వేస్తోనో.. భూమి రేటు రూ.5కోట్లకు వెళ్లిపోతేనే జరగదు. రాజధాని నిర్మాణం యాభై.. వందేళ్లు పడుతుందని భావించి.. అందుకు అనుగుణంగా పునాదులు వేస్తే మీరు అనుకున్నది జరుగుతుందే కానీ పాలకుడు ఆదేశిస్తే జరగదు కదా.

అమరావతి విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. అద్భుతాలు చేస్తాం అన్నారు. ల్యాండ్ పూలింగ్ చేశారు. భూమి ఇచ్చే వారు సంతోషంగా ఇచ్చారు. భూమి ధర పెరిగితే.. అందులో తన వాటా ఉందన్న భావన కలగాలి. కానీ.. నేను తీసేసుకున్నాను.. మీ చావు మీరు చావండన్నట్లుగా ఉండే పద్ధతి సరికాదు.

తెలంగాణ – సోనియా

తెలంగాణ విషయంలో నాడు నేను చెప్పిందే వాస్తవం అని తేలుతోంది. రాజ్యవ్యవస్థ మారకుండా రాజధాని మారితే ప్రయోజం లేదని అప్పుడే చెప్పా. రాష్ట్రం పేరు మారితే పెద్దగా ఏమీ ఒరగదు.  తెలంగాణ ఇవ్వటం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్నపార్టీ ఎత్తు పారలేదు. రెండు చోట్ల ఓడిపోయారు. విభజనతో రాజకీయంగా అద్భుతాలు సాధిస్తామనుకొని ఓడిపోయారు. ఏపీలో ఒక తరం వరకు కాంగ్రెస్ పార్టీ ఫుంజుకోకపోవచ్చు. తెలంగాణలోనూ ఆ  పార్టీ నుంచి చాలామంది జారుకున్నారు.

తెలంగాణ సాధించిన కీర్తిని ప్రజలకు కాకుండా సోనియాకు కట్టబెట్టినట్లైతే.. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు ఇదే విధానాన్ని ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా ఓట్ల కోసం.. సీట్ల కోసం దేశంలో అన్ని చోట్లా ఇదే ప్రయోగాన్ని చేసేవారు. తెలంగాణ అనుభవంతో ఎవరూఈ సాహసాన్ని చేసే అవకాశం లేదు. ప్రజలు తమలో తాము కోరుకొని.. సంఘీభావంతో ఒక ఒప్పందానికి వస్తే తప్పించి ఢిల్లీలో బలవంతంగా విభజన చేస్తామనే ప్రయత్నం ఇకపై ఎవరూ చేయరు.

ఇద్దరి చంద్రుళ్ల పాలన..

కేసీఆర్ పాలనలో మూడు అంశాలు నచ్చాయ్. గృహ నిర్మాణం.. ఇరిగేషన్.. నీటి సంరక్షణ..అధికార వికేంద్రీకరణ. పంచాయితీలకు ఏడాదికి రూ.5వేల కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పినప్పుడు నా గుండె ఉప్పొంగింది. మేం మొదటి నుంచి పోరాడుతున్నది దాని గురించే కదా.కానీ.. ఇప్పుడు ఆయన అలా చేయటం లేదు.

ఇక.. చంద్రబాబు విషయానికి వస్తే.. గతంలో ఉన్న విస్తృతస్థాయి దృక్ఫథం లేకుండాపోయింది. పెట్టుబడులకు కోసం ప్రయత్నిస్తున్నారు. అధికార వికేంద్రీకరణ మీద దృష్టి పెట్టకుండా కులా జంజాటంతోనే కాలం గడిపేస్తున్నారు. తాత్కాలికమైన కానుకలు.. పుష్కరాలు.. అమరావతి శంకుస్థాపనలతో గడిపేస్తున్నారు. ఈవెంట్ మేనేజ్ మెంట్ తప్పించి ఇంకేమీ జరగటం లేదు.

తెలుగు ప్రజలకు చెప్పేది..

రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత మనసులో కాసింత భయం ఉండేది. విభజన భావం ప్రజల మనసుల్లో ఉండి.. కలుషిత వాతావరణం సృష్టిస్తే ఎలా అన్న భయం ఉండేది. అలాంటిది జరగనందుకు సంతోషంగా ఉంది. గతంలో జరిగింది వదిలేస్తే.. ఒక సామరస్య వాతావరణాన్ని తీసుకొచ్చారు.మన సమస్యలకు కారణం వేరే వారు కాదు. గతంలో ఇదే విషయాన్ని తెలంగాణ వారికి చెప్పాను. ఇప్పుడు ఆంధ్రా వాళ్లకు చెబుతున్నాను. మన సమస్యలకు పరిష్కారాలు మన దగ్గరే ఉన్నాయి. మన చేతుల్లోనే ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఓటుకు నోటు కేసుపై..

ఓటుకు డబ్బులిస్తే.. పార్టీ ఫిరాయింపులు చేస్తే తప్పకుండా రాజ్యాంగ విరుద్ధమే. ఆ టేపులో గొంతు మీదా? కాదా? అని చంద్రబాబును నేను ఎప్పుడో ప్రశ్నించా. కానీ.. ఇలాంటి వ్యవహారాల్లో పవిత్రులు ఎవరు? అపవిత్రులు ఎవరు? ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీజేపీ ఇతర పార్టీల ఎంపీ సీటుకు రూ.20.. రూ.30 కోట్లు ఖర్చు పెట్టలేదని ఎవరైనా గ్యారంటీ ఇస్తారా?

ఎన్టీఆర్ ప్రభుత్వాన్నిబాబు పడగొట్టినప్పుడు..

ఒక నాయకుడికి.. మిత్రపక్షాలకు 225 సీట్లు కట్టబెడుతూ ప్రజలు తీర్పుఇచ్చినప్పుడు అర్థరాత్రి పూట సీఎంగా ఉన్న వ్యక్తిని దింపేస్తే అది ఏ రకమైన ప్రజాస్వామ్యం అవుతుంది? ఎలా రాజ్యాంగ బద్ధమవుతుంది? టెక్నికల్ గా చట్టబద్ధం కావచ్చు.కానీ.. అలాంటిది ఏ పార్టీ చేసినా నైతికంగా తప్పే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News