రాహుల్ ప్ర‌ధాని అయ్యేందుకు జేసీ చెప్పిన చిట్కా

Update: 2018-07-05 06:44 GMT
సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త అయిన అనంత‌పురం ఎంపీ - టీడీపీ నాయ‌కుడు మాట్లాడ‌టం మొద‌లుపెడితే..అది ఎక్క‌డ మొద‌లై ఎక్క‌డికి చేరుతుందో..ఎవ‌రికీ తెలియ‌ద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ ఉన్న సంగ‌తి తెలిసిందే. సంద‌ర్భం ఏదైనా, ప‌రిస్థితులు ఎలా ఉన్నా... తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పేయ‌డం జేసీ దివాక‌ర్ రెడ్డి నైజం. అలాంటి జేసీ తాజాగా జాతీయ రాజ‌కీయాల గురించి హాట్ కామెంట్లు చేశారు. అది కూడా ఢిల్లీలో మాట్లాడారా అంటే కానే కాదు...సాక్షాత్తు సొంత రాష్ట్రంలోనే. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపీలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజ‌రైన ఎంపీ జేసీ దివాకరరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఎన్ని రకాల పోరాటాలు చేసినా, దున్నపోతుపై వానపడినట్టుగానే ఉందని అన్నారు. ఐదు కోట్ల మంది బీజేపీపై వ్యతిరేకంగా ఉన్నారన్న ఇంటిలిజెన్స్ నివేదిక మోడీకి అందలేదా? అని ఆయన ప్రశ్నించారు. విభజన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చితేనే ఆంధ్రప్రదేశ్ స్వరూపం మారుతుందని అన్నారు. ఏపీ విషయంలో మోడీ తన మొండితనాన్ని వీడకుంటే - వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మళ్లీ పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రాన్ని విభజించిన పాపానికి కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుందని - విభజన హామీలను అమలు చేయకపోతే - బీజేపీకీ అదే గతి పడుతుందని ఆయన అన్నారు. రెండు రాష్ర్టాలుగా విడ‌దీస్తే..టీఆర్ ఎస్‌ - వైసీపీతో దోస్తీ చేసి ఢిల్లీలో అధికారంలోకి రావ‌చ్చ‌ని కాంగ్రెస్ అప్ప‌టి అధ్య‌క్షురాలు సోనియాగాంధీ భావించార‌ని జేసీ వెల్ల‌డించారు.

ఏక‌కాలంలో అధికారాన్ని తిరిగి నిల‌బెట్టుకోవ‌డం - త‌న కుమారుడు రాహుల్ గాంధీని  ప్ర‌ధాన‌మంత్రిని చేసే ల‌క్ష్యంతో సోనియాగాంధీ రాష్ట్ర విభ‌జ‌న చేశార‌ని జేసీ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా త‌ను గ‌తంలో సోనియాకు ఇచ్చిన స‌ల‌హాను జేసీ వెల్ల‌డించారు. ``దేశ రాజ‌కీయాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ది కీల‌క పాత్ర. ఆ రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల సంఖ్య ఎక్కువ‌. వారి మ‌న‌సు గెలుచుకోవాలంటే యూపీ బ్రాహ్మ‌ణ మ‌హిళ‌ను రాహుల్ గాంధీ వివాహం చేసుకోవాలి. అప్పుడే ఆయ‌న ప్ర‌ధాని కాగ‌లుగుతారు అని సోనియాగాంధీకి చెప్పాను. అయ‌తే,ఆమె న‌వ్వి ఊరుకున్నారే త‌ప్ప‌...నా మాట‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌లేదు`` అని జేసీ ఆస‌క్తిక‌ర‌మై అంశాన్ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా య‌థావిధిగా ఆయ‌న ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైసీపీపై విమ‌ర్శ‌లు చేశారు. కాగా, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన కాంగ్రెస్ గురించి - ఆ పార్టీ నాయ‌కుడు ప్ర‌ధాని అయ్యేందుకు దోహ‌ద‌ప‌డే అంశాల గురించి ఇప్ప‌టికీ ప్ర‌స్తావించ‌డం ఆస‌క్తికరంగా ఉంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News