జ‌గ‌న్‌ పై మ‌ళ్లీ నోరు పారేసుకున్న జేసీ

Update: 2017-11-14 18:36 GMT
రాజ‌కీయాల్లో త‌ల‌పండిన నేత‌లుగా ఉన్న‌వారు న‌లుగురికి ఆద‌ర్శంగా ఉండాలి. ఎలా ఉండాలో..ఎలా ఉండ‌కూడ‌దో చెప్పేలా స‌ద‌రు నేత‌లు వ్య‌వ‌హ‌రించాలి. కానీ కొంద‌రు దాన్ని మ‌రిచిపోయి ప్ర‌వ‌ర్తిస్తూ...ఇబ్బందిక‌ర‌మైన కామెంట్లు చేస్తుంటారు. అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంలో ముందుండే వారిలో టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఒక‌రనే టాక్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై నోరు పారేసుకోవ‌డం ద్వారా త‌న ఆవేశాన్ని చ‌ల్లార్చుకునే జేసీ...తాజాగా మ‌ళ్లీ అదే రీతిలో స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో కష్టాలు పడి రాయలసీమకు నీరు ఇస్తుంటే అనంతపురానికి నీరు ఇవ్వడం ఇష్టంలేకో మరి కక్షతోనే గానీ జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన పల్నాడుకు నీరు ఇవ్వాలనే కొత్త వాదనను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ అరిగిపోయిన రికార్డు వదలాలని - మహానేత పేరు మాని - తానేం చేస్తావో చెప్పాలని దివాకర్‌ రెడ్డి జగన్‌ కు సూచించారు. ఎప్పటికీ ముఖ్యమంత్రివి కాలేవని - ప్రయత్నాలన్నీ మానుకోమని హితవు పలికారు. ప్రతి ఒక్కరికీ సొంత గడ్డపై ప్రేమ ఉండాలని - శ్రీశైలంలో నీరున్నా - లేకున్నా ఎవరెవరి కాళ్లు పట్టుకున్నాడో తెలియదని, అనుమతులు ఉన్నా, లేకున్నా  సీఎం చంద్రబాబు పట్టిసీమ ద్వారా అనంతపురం జిల్లాకు నీరందిస్తున్నారని చెప్పారు. జగన్ మాత్రం పుట్టిన జన్మభూమిని మర్చిపోయి.. రాయలసీమకు ఎలా ఇస్తారు.. పల్నాడుకు నీరివ్వాలని అనడం సరికాదన్నారు. ఇంకా జగన్‌ ఉద్దేశించి మావాడికి  పోయే కాలం దాపురించిందని, జ‌గ‌న్ ఓ తిక్క‌లోడు అని తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఆలోచనంతా ముఖ్యమంత్రి కుర్చీ చుట్టే ఉందంటూ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సంపాదించాలని వైఎస్ జగన్ ప్రయత్నమని ఆయన ఆరోపించారు.

కాగా, జేసీ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత‌లు మండిప‌డ్డారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే జేసీ దివాకర్‌రెడ్డి చంద్రబాబుకు వత్తాసు పలకడం సిగ్గుచేటని వైసీపీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ‌ అన్నారు. సీఎం మెప్పుపొందేందుకు జేసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి వాళ్లను ప్ర‌జ‌లు ఛీకొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
Tags:    

Similar News