జేసీ మాట: ఇప్పుడాయన బోడిలింగం అంటున్నాడు

Update: 2016-05-05 04:23 GMT
ఏపీకి ప్రత్యేక హోదా లేదన్న విషయాన్ని మోడీ సర్కారు పార్లమెంటులో స్పష్టంగా తేల్చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రరాష్ట్రానికి చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరి అన్న విషయం తెలిసినా.. స్వయంగా తాను ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చినా.. అధికారం చేతికి వచ్చిన తర్వాత తాను చెప్పే మాటలకు చేసే చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదన్న విషయాన్ని తాజాగా తేల్చేసిన వైనం.

ఏపీకి ప్రత్యేక హోదా లేదన్న విషయాన్ని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీకి చెందిన అధికార పక్ష ఎంపీలు భగ్గుమన్నారు. ఇదేం పద్ధతి అని ప్రశ్నించటంతో పాటు.. మోడీ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టారు. మిగిలిన నేతలకు భిన్నంగా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడే తత్వం ఉన్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. తాజా పరిణామాల నేపథ్యంలో తనదైన శైలిలో స్పందించారు. ఒక టీవీ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని యథాతధంగా చూస్తే..

ఇవాళ వాళ్లు స్పష్టంగా చెబుతున్నారు కానీ.. ఇది జరిగేది కాదు.. చచ్చేది కాదని మాకీ ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగు మాసాలకే అర్థమైంది. నేను ఏడాదిన్నర క్రితమే చెప్పా. ఇది రాదని అందరికి తెలుసు. ముఖ్యమంత్రికి కొంత చాతుర్యం ఉంది కాబట్టి.. ఎట్లానో రాష్ట్రం అభివృద్ధి కోసం భంగపడి.. బతిమిలాడి.. ఒకటికి నాలుగుసార్లు వాళ్లను కలుసుకొని.. వాళ్లను ప్రసన్నం చేసుకొని రాష్ట్రానికి కాస్త ఆర్థిక సాయం చేసుకోగలుగుతున్నాడే తప్పించి.. ఇచ్చిన హామీలేమీ నెరవేరుతాయన్నది లేదు.

తాజాగా తీసుకున్న నిర్ణయం బీజేపీ.. తెలుగుదేశం పార్టీల మధ్య తప్పకుండా ప్రభావితం చేస్తాయి. ఆనాడు తిరుపతి.. అమరావతిలో చెప్పారు. ఆ మాటకు వస్తే చాలానే చోట్ల ప్రధాని మోడీ చెప్పారు.. విభజన హామీలు తీరుస్తామని. ఆయనకు అటూఇటూ ఊగిసలాడే మెజార్టీ ఉండి ఉంటే.. ప్రత్యేక హోదా తప్పకుండా వచ్చి ఉండేది. ఇప్పుడాయనకు ఎవరితోనూ అవసరం లేదు. 36 స్టేట్లు.. మన స్టేట్ ను బోడిలింగం అంటున్నాడు. పని అయిపోయింది. వాళ్లకు ఎవరి సహాయ సహకారాలు అక్కర్లేదు. స్వతంత్రంగా వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు.

వాళ్ల (బీజేపీ)కు మరొక ఆశ ఉంది. వాళ్లకే కాదు.. ప్రతి రాజకీయ పార్టీకి తాము ప్రతి రాష్ట్రంలో పైకి రావాలని ఉంటుంది. అదేమీ తప్పు కాదు. బీజేపీకి కూడా సొంతంగా తమ బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. మా వాళ్లు ఎవరూ చెప్పరు కానీ నాకైతే అనుమానం ఉంది.. రేపు ఎలక్షన్లో వాళ్లు స్వతంత్రంగా నిలబడటానికి.. ఆంధ్రప్రదేశ్ లో ప్రయత్నం చేస్తారు కాబట్టి.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దేదీప్యమానంగా వెలిగిపోవటానికి.. బాబు సమర్థవంతుడు కాదని నిరూపించటానికి ప్రయత్నం చేస్తారన్నది నా అభిప్రాయం. దాన్లో ఇదొక భాగమని నాకు తెలుసు.

నా కంటే ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇంకా బాగా తెలుసు. దీనికి మించి చాలా విషయాలు తెలుసు. కార్యసాధకుడు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ.. కొంత డబ్బులు సంపాదించాడు.. ఇంకా కాస్త డబ్బులు సంపాదించాలి రాష్ట్రానికి అన్న తాపత్రయం అతనిలో ఉంది కాబట్టి కొన్ని అవమానాలు కూడా భరిస్తున్నాడు.

నా ఒక్కడికో.. మంత్రులకో.. ఎంపీలకో.. ఎమ్మెల్యేలకో కాదు.. ఆంధ్రరాష్ట్రంలో పేపరు చదువుతున్న.. చదవగలిగిన ప్రతిఒక్కరికి ప్రతి ఒక్కడికి తెలుసు ఈ రహస్యం. అయితే.. ఎవరంతకు వారు బయటపడటం లేదు. ఏదో కొంతమంది రాజకీయనాయకులకు.. ఏమీ మాట్లాడకుంటే.. పార్లమెంటులో ఏమీ మాట్లాడకుంటే ఏం చేశావయ్యా అని ఓటర్లు ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు మావాళ్లు మాట్లాడుతున్నారు.

ఏం ప్రెషర్ తెచ్చినా ప్రయోజనం లేదు. ప్రతి ఒక్కడూ ప్రెషర్ తీసుకురా.. ప్రెషర్ తీసుకురా అంటుంటారు. నాకు తెలీక అడుగుతున్నా వాటీజ్ ద మీనింగ్ ఆఫ్ ప్రెషర్..? (ఒత్తిడి అన్న పదానికి అర్థం ఏమిటి?) పర్సనల్ గా పోయాం. మొక్కాం. నమస్కారాలు చేశాం. పిటీషన్లు ఇచ్చాం. కాగితాలు ఇచ్చాం. మా పరిస్థితి ఇదని చెప్పాం. అప్పుడప్పుడు పార్లమెంటులో అడిగాం.

అదేదో పవన్ చెబుతుంటారు సినిమాల్లో మాదిరి. ప్రెజర్ తీసుకురా అంటారు.. ప్రెజర్ ఏంటో చెప్పు స్వామీ? ప్రెజర్ తీసుకొస్తాం. మేం పదహారు మందిమి రాజీనామా చేస్తామంటే స్పెషల్ స్టేటస్ ఇస్తామంటారా?.. మేం మా పదవులకు రాజీనామా చేయటానికి ఈ నిమిషంలో సిద్ధం. స్పెషల్ ఆర్డర్ ఒకవైపు పెట్టండి.. మా రాజీనామాలు మరో చేతిలో పెడతాం. ఎక్సైంజ్ చేసుకుందాం.

మిగితావాళ్ల సంగతేమో కానీ నేనైతే సంవత్సన్నర కిందటే మానసికంగా సిద్ధమయ్యా. నేను అందరికి చెబుతానే ఉన్నా. పేపరు చదివే ప్రతి ఆంధ్రా పౌరుడికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా పోటీకి దిగుతుందన్న విషయం తెలుసు. బహుశా పెద్దలు ఒప్పుకోరు కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఈ అభిప్రాయం ఉంది.
Tags:    

Similar News