బాబు-కేసీఆర్... దొందూ దొందే

Update: 2016-03-10 12:12 GMT
అనంతపురం ఎంపీ దివాకర్ రెడ్డి శైలే వేరు. ఆయన కనిపిస్తే చాలు మీడియా అక్కడ మైకులతో వాలిపోతుంది. అతన్ని ఏదో ఒక వివాదాస్పదమైన ప్రశ్న అడిగి... అతని నుంచి సమాధానం రాబట్టుకోవాలని చూస్తుంది. తాజాగా ఏపీ-తెలంగాణాలో చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’పై తనదైన శైలిలో స్పందించాడు. ‘ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ విషయంలో దొందూ దొందే. ఏమాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా ఇద్దరూ ఇద్దరేలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణాలో తెరాసలో చేరుతున్నవారికి డబ్బులు లేదా పదవులైనా అది కాకుండా కనీసం వారి పనులైనా చేస్తారని ఆ పార్టీలో చేరుతున్నారు. ఏపీలో అది మాత్రం జరగదు. తాను కూడా ఆకర్షణలో భాగంగానే తెలుగుదేశం పార్టీలో చేరినట్టు’ తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘జగన్ పార్టీలో అతనొక్కడే మిగులుతాడని... వైఎస్సార్సీ ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనలేదని.. జగన్ వైఖరి నచ్చకనే టీడీపీలోకి వస్తున్నారని’ తెలిపారు. రాష్ట్ర విభజన సమయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్పట్లో ‘రాయల తెలంగాణ’ ఇచ్చి వుంటే బాగుండని అన్నారు. అదే జరిగివుంటే.. రాయలసీమకు కష్టాలొచ్చేవి కాదన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారని తెలిపారు.

విభజన సమయంలో తాను సోనియాతో ఏమన్నది మరోసారి మీడియాతో గుర్తు చేసుకున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసి రాష్ట్ర విభజన సరికాదని.. ఈ విషయంలో పునరాలోచించాలని సూచించినా... తన మాటను పట్టించుకోకుండా మరో ఇరవయ్యేళ్ల తరువాతైనా విభజన అనివార్యం కదా అన్నారని తెలిపారు.

Tags:    

Similar News