రూట్ మార్చిన జేసీ కొత్త షాకిచ్చారు

Update: 2016-05-30 11:08 GMT
అనంత‌పురం రాజ‌కీయాల్లో జేసీ సోద‌రుల గురించి తెలియ‌ని వారెవరుండ‌రు. త‌మ‌దైన శైలిలో రాజ‌కీయాలు చేసే ఈ సోద‌రుల్లో చిన్న‌వాడైన తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డి ఇపుడు సంచ‌ల‌నానికి తెర‌తీశారు. జేసీ బ్ర‌ద‌ర్స్ అంటే రెచ్చ‌గొట్టే కామెంట్లు - నిజాల్ని నిర్భ‌యంగా చెప్పే త‌త్వ‌మే కాదు స‌మాజంలో ప‌రివ‌ర్త‌న తెచ్చేందుకు త‌మ‌దైన శైలిలో ప‌ట్టువిడ‌ని ప్ర‌య‌త్నం చేసేవారు కూడా అని నిరూపించారు. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి గురించి ఇంత‌గా పొగిడేసేలా ఆయ‌న చేసిన గొప్ప ప‌ని అంటారా? చ‌ద‌వండి మ‌రి....

త‌న నియోజ‌క‌వ‌ర్గమైన తాడిపత్రిలో ప్లాస్టిక్ కవర్లు అమ్మకూడదంటూ జేసీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డి హుకుం ఇచ్చేశారు. ఆ...ఏదో అంద‌రిలాగానే ఈయ‌నా చెప్పేశాడు అనుకోకండి. త‌ప్ప‌నిస‌రిగా పాటించ‌ని వారిపై అధికారుల‌తో దాడులు చేయించి జ‌రిమానా విధించేలా చేశారు. అదికూడా ఏ వందో రెండోంద‌లో కాదు. ఏకంగా ప‌దివేల నుంచి యాభై వేల వ‌ర‌కు మోత మోగించేశారు. ఈ దెబ్బ‌కు తాడిప‌త్రిలో ప్లాస్టిక్ కవర్లు మాయం! అయితే జేసీ గారి స‌మాజ‌సేవ ఇక్క‌డ‌తో ఆగిపోలేదండోయ్‌! ప్ర‌తి ఇంటికో మొక్క అనే నినాదాన్ని తీసుకువ‌చ్చారు. స్ట్రిక్ట్‌ గా అమ‌లు చేయించేస్తున్నారు.

ముందుగా దుకాణాల‌తో ఈ రూల్‌ను మొద‌లుపెట్టిన జేసీ ప్రభాక‌ర్ రెడ్డి దాన్ని పాటించ‌ని దుకాణాల‌ను సీజ్ చేయించేందుకు ఆర్డ‌ర్స్ పాస్ చేశారు. అలా కొన్నింటికీ తాళాలు వేయించారు కూడా. అలా చిక్కుల్లో ప‌డ్డ‌వారు మొక్క‌లు నాటిన త‌ర్వాతే దుకాణం తెరుచుకుంది మ‌రి. నాట‌డం అంటే ఏదో అలా నాటి వ‌దిలేయ‌డం కాదు. వాటిని పోష‌ణ బాధ్య‌త కూడా సద‌రు దుకాణ‌దారులదే. దుకాణాలు అయిపోయిన త‌ర్వాత నివాసాల‌పై జేసీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డి చూపు ప‌డింది. ప్ర‌జాసంక్షేమం కోసం ప్ర‌తి ఇంటికో మొక్క పెంచాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. మేం పెంచేది లేదు అన్న వారి ఇంటికి న‌ల్లా క‌నెక్ష‌న్ క‌ట్ చేశారు. దెబ్బ‌కు కొంద‌రు ప‌ర్యావ‌ర‌ణ వ్య‌తిరేకులు దారికి వ‌చ్చారు.

ఇదండి జేసీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డిగారి సామాజిక స్పృహ‌. ప్లాస్టిక్ గురించి మాట‌లు చెప్పి వ‌దిలేయ‌డ‌మో...లేక‌పోతే మొక్క‌లు పెంచాల‌ని మొక్కుబ‌డిగా మాత్ర‌మే చెప్పి ఊరుకోవ‌డ‌మో కాకుండా చిత్త‌శుద్ధితో దాన్ని అమ‌ల్లో పెట్ట‌డం అభినంద‌నీయ‌మే. అంతేకాదు ప‌లువురికి ఆద‌ర్శం కూడా. ప్ర‌భాక‌ర్‌ రెడ్డి లాగానే మిగ‌తా నాయ‌కులు కూడా ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు అయితే పుడ‌మి త‌ల్లి పుల‌కించిపోతుంది క‌దా!ఏమ‌ంటారు?
Tags:    

Similar News