ఉచిత ఆఫర్ కోసం తాడిపత్రి ఎమ్మెల్యే గొడవ

Update: 2016-02-04 06:56 GMT
తమ మాట నెగ్గించుకోవడానికి ఏమైనా చేసే అనంతపురం సోదరులు జేసీ బ్రదర్స్ మరోసారి చంద్రబాబును ఇరుకునపెడుతున్నారు. తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసే ప్రభాకరరెడ్డి పోలీసులతో తనకు ఏర్పడిన వివాదాన్ని పెద్దదిగా చేసి చూపే ప్రయత్నంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ వివాదాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అనుకున్నది సాధించుకోవాలన్నది ఆయన ప్లానుగా తెలుస్తోంది.

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి - అనంతపురం జిల్లా పోలీసులకు మధ్య వివాదం ఇటీవల ముదిరింది. ప్రభాకర్‌ తనకు కేటాయించిన ఇద్దరు గన్‌ మెన్లను వెనక్కు పంపించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన అనుచరులకు గన్ మెన్లను కేటాయించడంలో చూపిన నిర్లక్ష్యమే అందుకు కారణమని ఆయన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది.

జేపీ ప్రభాకర్‌ రెడ్డి ఇటీవల తన అనుచరులకు గన్ మెన్లు కావాలని కోరారు. పోలీసులు అందుకు ఓకే అన్నా పెయిడ్‌ గన్‌ మెన్‌ లను కేటాయించారు. దీంతో ఆయన అలా కాకుండా తామేమీ ఖర్చు భరించే అవసరం లేకుండా ఉచితంగా గన్ మెన్లను కేటాయించాలని మళ్లీ కోరారు. కానీ, దానికి పోలీసు అధికారుల నుంచి స్పందన లేదు. ప్రభాకర్‌ రెడ్డి పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన ఆయన తనకు కూడా గన్‌ మెన్‌ లు అవసరం లేదని వెనక్కు పంపించారు. వారం రోజుల నుంచి పోలీసులకు, జేసీకి మధ్య వివాదం నడుస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులు జేసీ మాట వినకపోవడానికి వెనుక అధికార పార్టీకే చెందిన నేతల హస్తముందని భావిస్తున్నారు.

పోలీసులు ఎంతకీ తన మాట వినకపోవడంతో జేసీ దీన్ని పెద్దది చేస్తే కానీ సెటిల్ కాదన్న ఉద్దేశంతో ఈ స్టెప్ వేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని చెబుతున్నారు. ఈ వివాదం ఎలాంటి టర్ను తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News