రాహుల్ ను మాజీకాంగ్రెస్ నేతలే అడ్డుకొంటారట!

Update: 2015-07-13 02:31 GMT
త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి హెచ్చరికలు వినిపిస్తున్నాయి. రైతు కుటుంబాలను పరామర్శించడానికి అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్న రాహుల్ ను వీరు హెచ్చరిస్తున్నారు. రాహుల్ పర్యటనకు ఏర్పాట్లలో తలమునకలై ఉన్న కాంగ్రెస్ నేతలను కూడా తెలుగుదేశం పార్టీ నేతల హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. రాహుల్ పాదయాత్రను అడ్డుకొని తీరతామని వారు చేస్తున్న హెచ్చరికలు ఎక్కడ తమ పార్టీ యువరాజును ఇబ్బంది పెడతాయో.. అని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు.

ఇక్కడ విడ్డూరం ఏమిటంటే.. ఇప్పుడు రాహుల్ యాత్రను అడ్డుకొంటామంటున్నది ఒకప్పుడు  కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నేతలే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రాహుల్ భజన చేసిన వాళ్లు.. సోనియాను అమ్మా అని సంబోధించిన వారే ఇప్పుడు రాహుల్ గాంధీకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రాహుల్ కు హెచ్చరికలు జారీ చేసిన ప్రముఖుడు. రాహుల్ యాత్రను అడ్డుకొంటామని ఈయన ప్రకటించాడు. మరి కాంగ్రెస్ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ల దివాకర్ రెడ్డి అధిష్టానానికి అనుంగుగా ఉండేవాడు!

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. కాంగ్రెస్ హయాంలో నమోదన రైతు ఆత్మహత్యల విషయంలో పరిహారాన్ని అందించకుండా.. ఇప్పుడు రాహుల్ పాదయాత్ర చేపడితే తాము సహించమని ఈ తెలుగుదేశం నేతలు అంటున్నారు. ఈ డిమాండ్ ను ఆది నుంచి టీడీపీలో ఉన్నవారు చేస్తే అదో ముచ్చట. అయితే జేసీ బ్రదర్స్ అప్పట్లో కాంగ్రెస్ లో ఉండేవారు. అప్పుడే ఏమీ మాట్లాడని వీరు.. ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ హయాంలో నమోదైన ఆత్మహత్యలకు పరిహారాన్ని ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉంది. అయితే రాజకీయాల్లో ఇలాంటి విడ్డూరాలు కొత్తమీ కాదు. తమ ప్రస్తుత అజెండాలకు తగ్గట్టుగా నేతలు ఎలాగైనా మాట్లాడగలరు.. ఏమైనా మాట్లాడగలరు!
Tags:    

Similar News